Revanth Reddy: 2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు: రేవంత్ రెడ్డి ఆరోపణ

టీఎస్‌పీఎస్‌సీలో పేపర్‌ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండానే కేవలం ఇద్దరు మాత్రమే తప్పు చేశారని మంత్రి కేటీఆర్‌ ఎలా చెబుతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో రేపు వాదనలు వినిపించనున్నట్లు రేవంత్ చెప్పారు.

Updated : 19 Mar 2023 16:21 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన వారిని విచారించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో అధికారిణి శంకరలక్ష్మి పాత్ర ఏంటనేది బయటపెట్టాలన్నారు. ఈ పేపర్‌ లీకేజీ వ్యవహారం మొత్తాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. పెద్దల పేర్లు చెబితే ఎన్‌కౌంటర్‌ చేస్తామని రిమాండ్‌లో ఉన్న నిందితులను బెదిరించారని రేవంత్‌ ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీలోని ఉద్యోగులకు పరీక్షలు రాసే అర్హత లేదని.. అలాంటప్పుడు కమిషన్‌లో పనిచేస్తోన్న 20 మంది పరీక్షలు ఎలా రాశారని ఆయన ప్రశ్నించారు. గతంలో కమిషన్‌లో పని చేసిన ఓ ఉద్యోగి గ్రూప్‌-1కు ఎంపికయ్యారని ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు.

‘‘పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండానే కేవలం ఇద్దరు మాత్రమే తప్పు చేశారని మంత్రి కేటీఆర్‌ ఎలా చెబుతారు? గ్రూప్-1 పేపర్‌ లీకేజీలో కేటీఆర్‌ పీఏది కీలకపాత్ర. ఈ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డితో అతనికి సంబంధం ఉంది. వారిద్దరిదీ పక్కపక్క గ్రామాలే. అతను చెబితేనే రాజశేఖర్‌రెడ్డికి కేటీఆర్‌ ఉద్యోగమిచ్చారు. మల్యాల మండలంలో 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయి. 2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయి. అమెరికా నుంచి వచ్చి నేరుగా గ్రూప్-1 రాసిన అమ్మాయికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగికి 4వ ర్యాంక్‌ వచ్చింది. వారిద్దరికీ ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చాయో తేల్చాలి. గ్రూప్‌-2లో ఓకే చోట పరీక్ష రాసిన 25 మందికి ఉద్యోగాలొచ్చాయి. మొత్తంగా కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం నడిచింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు