Rajasthan : రాజస్థాన్‌ అసెంబ్లీలో ఘర్షణ.. పదవీచ్యుతుడైన రాజేంద్ర సింగ్‌ గుడా బహిష్కరణ

మణిపుర్‌ (Manipur) కన్నా రాజస్థాన్‌లోనే (Rajasthan) మహిళలకు భద్రత కరవైందని విమర్శించిన మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడాను (Rajendra Gudha) సీఎం అశోక్‌ గహ్లోత్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన, కొందరు కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు.

Updated : 24 Jul 2023 17:00 IST

Image : Vishnu Vardhan Reddy

జైపుర్‌ : రాజస్థాన్‌లో (Rajasthan) సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విమర్శలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్న రాజేంద్ర సింగ్‌ గుడా (Rajendra Gudha) ఇవాళ మరోసారి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే రఫీఖ్‌ ఖాన్‌, ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్‌ను చుట్టుముట్టారు. వెంటనే రాజేంద్ర సింగ్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ పద్ధతి మంచిది కాదని వారించిన స్పీకర్‌ సీపీ జోషితోనూ వాగ్వాదానికి దిగారు. దాంతో స్పీకర్‌ మార్షల్స్‌ను పిలిపించి రాజేంద్రను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. తరువాత సభను వాయిదా వేశారు.

అమిత్ షాతో బండి సంజయ్‌ భేటీ.. రాజకీయ పరిణామాలపై చర్చ

ఈ ఘటనపై రాజేంద్ర సింగ్‌ గుడా విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రులతో సహా ఐదు నుంచి ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చుట్టుముట్టి నాపై ముష్టిఘాతాలు కురిపించారు. సభలోనే నాపై చేయి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టారు. మంత్రి ధరివాల్‌ సైతం దాడి చేశారని’ ఆయన ఆరోపించారు. సభ నుంచి బయటకు గెంటేసిన తరువాత రాజేంద్ర అసెంబ్లీ భవనం పరిసరాల్లోకి రాకుండా మార్షల్‌ నిలువరించారు. సాధారణంగా ఎమ్మెల్యే ప్రవర్తన బాగా లేకపోతే స్పీకర్‌ సభ నుంచి మాత్రమే బయటకు పంపిస్తారు.

ఇదీ నేపథ్యం..

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కనీస ఆదాయ హామీ బిల్‌ 2023పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మణిపుర్‌ ఘటనపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో మంత్రి గుడా మట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే మహిళలకు రక్షణ కల్పించడంలో మనం విఫలమయ్యాం. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయి. మణిపుర్‌ ఘటనపై మనం ప్రశ్నలు లేవనెత్తేముందు తొలుత మన రాష్ట్రంలో జరుగుతున్న తీరును ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడా అన్నారు.

దీంతో విపక్ష భాజపా ఒక్కసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్ర మంత్రే స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతున్నాడంటే ఇది ప్రభుత్వం మాట్లాడినట్లే. ప్రభుత్వ తీరును స్వయంగా మంత్రి బట్టబయలు చేశారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు మంత్రికి కృతజ్ఞతలు. కానీ, ఇది అవమానకర విషయం అని భాజపా నేత రాజేంద్ర రాథోడ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో మంత్రి గుడా తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు సీఎం గహ్లోత్‌ సిఫారసు చేశారు. దీంతో వెంటనే గవర్నర్‌ ఆమోదం తెలిపారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని