LS Polls: ఐదు రోజులు.. ఐదు రాష్ట్రాలు.. దక్షిణాదిలో మోదీ దూకుడు!

లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో భాజపా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 19 వరకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.

Updated : 15 Mar 2024 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ భారతం (South India).. కర్ణాటక, తెలంగాణ మినహా ఇప్పటివరకు భాజపా (BJP)కు కొరుకుడు పడని ప్రాంతం. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 130 సీట్లకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. రానున్న ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాకు 370, దాని నేతృత్వంలోని ఎన్డీయేకు 400కుపైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నిర్దేశించుకున్న కమలదళం.. ఈ దిశగా ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.

దక్షిణ భారతంలో మరిన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇక్కడి ఐదు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఈనెల 19 వరకు స్థానికంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఒకేరోజు కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపాకు ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల మీదుగా ఈ ప్రచార వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం.

  • తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌, కర్ణాటకలోని గుల్బర్గాలో శనివారం ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. గుల్బర్గా ప్రాంతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కంచుకోట! అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు.
  • ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లో ‘తెదేపా- జనసేన- భాజపా కూటమి’ ఉమ్మడి బహిరంగ సభలో పాల్గోనున్నారు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ఈ మూడు పార్టీలు ఇటీవల చేతులు కలిపాయి.
  • 18న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో రోడ్‌షోలో పాల్గోనున్నారు. అయితే.. దీనికి రాష్ట్రప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో పార్టీ శ్రేణులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో షరతులతో అనుమతి లభించింది. అదేరోజు తెలంగాణలోని జగిత్యాల, కర్ణాటకలోని శివమొగ్గలో మోదీ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 19న కేరళలోని పాలక్కడ్‌లో రోడ్‌ షో, తమిళనాడు సేలంలో బహిరంగ సభలో పాల్గోనున్నారు.

ఈసారి కేరళలో కమలం వికసించబోతోంది: ప్రధాని మోదీ

2019 ఎన్నికల్లో పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే.. కర్ణాటకలో మాత్రం 28 స్థానాల్లో 25, తెలంగాణలో 17 సీట్లలో నాలుగింటిని కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో కొత్త పొత్తులు ఏర్పాటు చేసుకున్న భాజపా.. పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. మరోవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ప్రధాని మోదీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు