Karnataka Polls: భాజపాను అందుకే వీడుతున్నారు : సీఎం బొమ్మై

కర్ణాటక (Karnataka Elections) భాజపాలో ఇటీవల పెరుగుతున్న కీలక నేతల రాజీనామాలపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) స్పందించారు. ఇక్కడ టికెట్టు రాని అసంతృప్త నేతలే పార్టీని వీడుతున్నారని అన్నారు. 

Published : 15 Apr 2023 02:02 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Elections) సమయం దగ్గర పడుతున్న వేళ.. అధికార పక్షానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ నుంచి కీలక వ్యక్తులు ఒక్కొక్కరు రాజీనామా (Resignations) చేసి వెళ్లిపోతుండటం కాషాయ పార్టీని కలవరపెడుతోంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై  (Basavaraj Bommai) స్పందించారు. శాసనసభ్యులుగా ఎన్నిక కావాలనే ఆశతో కొందరు నేతలు భాజపాను వీడిపోతున్నారని.. కానీ, కార్యకర్తలు మాత్రం పార్టీకే అంకితమై ఉన్నారని అన్నారు.

‘అధికారపక్షంలో ఉన్నందున అసెంబ్లీ టికెట్ల విషయంలో భారీ డిమాండ్‌ ఉండటం సర్వసాధారణమే. మేం మా కార్యకర్తలతో మాట్లాడుతూనే ఉన్నాం. వారు నిబద్ధతతో పార్టీకే అంకితమై ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే కావాలనే ఆశతో కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తమ పార్టీలో టికెట్‌ రానటువంటి అసంతృప్త నేతలను కాంగ్రెస్‌ చేర్చుకుంటోంది. అది పెద్ద విషయమేమీ కాదు’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. ఇక భాజపాలోని రెబల్‌ నేతలతో కాంగ్రెస్‌ పార్టీ టచ్‌లో ఉందని వస్తోన్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా.. ఘన చరిత్ర ఉన్న ఆ పార్టీకి (కాంగ్రెస్‌కు) 60 స్థానాల్లో సరైన అభ్యర్థులే లేరని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు.

ఇదిలాఉంటే, కర్ణాటకలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని భాజపా, ఎలాగైనా ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇటీవల అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుండడంతో టికెట్‌ రాని, అసంతృప్త నేతలు భాజపాను వీడి కాంగ్రెస్‌, జేడీఎస్‌లో చేరిపోతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌ సావడి భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈయనకంటే ముందు పలువురు కీలక నేతలు కూడా భాజపాను వీడటం అధికార పార్టీని కలవరపెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని