CM Jagan: విమర్శించే వాళ్లకు అభివృద్ధి కనిపించడం లేదా?: సీఎం జగన్‌

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2,250కు పెంచామన్నారు.

Updated : 01 Jan 2022 13:29 IST

పింఛన్‌ రూ.250 పెంపు కార్యక్రమంలో సీఎం

ప్రత్తిపాడు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2,250కు పెంచామన్నారు. రెండున్నరేళ్లలో ఇవాళ రూ.2,500కు పింఛన్‌ పెంచుతున్నామని చెప్పారు. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు రూ.250 పింఛను పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించిన జగన్‌.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

మాట నిలబెట్టుకుంటాం..

‘‘ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు కూడా ఉంటారు. విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా? పింఛన్ రూ.3వేలకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం.

కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు..

రాష్ట్రంలో ఇవాళ 62లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం నెలకు పింఛన్‌లకు రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిది. దాన్ని వైకాపా ప్రభుత్వం రూ.1450 కోట్ల నుంచి రూ. 1,570 కోట్లకు పెంచింది. అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఓటీఎస్ పథకం ద్వారా గృహ హక్కు కల్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు.

వీరంతా పేదలకు శత్రువులు కాదా?

పేదలకు అందుబాటులో వినోదం అందించేందుకు సినిమా టికెట్లు ధరలు తగ్గించాం. కానీ ఆ విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీరంతా పేదలకు శత్రువులు కాదా అని అడుగుతున్నా. పేదలకు మంచి జరగకూడదని వారు అడ్డుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనైనా విమర్శకులకు మంచి ఆలోచనలు రావాలి. గుంటూరు ఛానల్‌ పొడిగింపు కోసం రూ.256 కోట్లు మంజూరు చేశాం. ఛానల్‌ పొడిగింపు పనులు త్వరగా పూర్తి చేస్తాం’’ అని జగన్‌ అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని