Rahul Gandhi: ఆ కేంద్రమంత్రిని జైలుకు పంపేవరకూ విశ్రమించను..!

లఖింపుర్‌ ఖేరి వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శించారు. అంతేకాకుండా.........

Updated : 22 Dec 2021 01:32 IST

సిట్‌ నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాల డిమాండ్‌

దిల్లీ: లఖింపుర్‌ ఖేరి వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శించారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడి తండ్రికి ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందని ఆరోపించిన ఆయన.. లేకుంటే ఇప్పటికే ఆయన మంత్రిపదవి ఊడిపోయి ఉండేదని వ్యాఖ్యానించారు. లఖింపుర్‌ ఖేరి రైతులపై జరిగిన ఘటన కుట్రగా తేలినప్పటికీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించకపోవడంపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిని నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో మరోసారి నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ఆ కేంద్రమంత్రిని జైలుకు పంపించే వరకూ విశ్రమించనని ఉద్ఘాటించారు.

లఖింపుర్‌ ఖేరి కేసులో నిందితుడు ఇప్పటికే అరెస్టు అయినప్పటికీ అతడి తండ్రిని మాత్రం మంత్రిపదవి నుంచి తప్పించకపోవడం పట్ల విపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా లఖింపుర్‌ ఘటన కుట్రేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుబట్టాయి. అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్‌ చౌక్‌ వరకూ మార్చ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. కేంద్ర మంత్రి (అజయ్‌ మిశ్రా)ను వదిలే ప్రసక్తే లేదని, ఆయన్ను జైలుకు పంపిచే వరకూ విశ్రమించేదే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రితో పాటు మీడియా కూడా ఏమీ చేయడం లేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి ఓవైపు రైతులకు క్షమాపణ చెబుతూనే మరోవైపు లఖింపుర్‌ ఘటనలో పాత్ర ఉన్న వ్యక్తిని తన కేబినెట్‌లో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైన లఖింపుర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు సజావుగా సాగాలంటే నిందితుడి తండ్రి అజయ్‌ మిశ్రాను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

ఇక రాజ్యసభ నుంచి సస్పెండైన 12 మంది ఎంపీలను వెంటనే ఎత్తివేయాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. మరింత మందిని సస్పెండ్‌ చేసినా కూడా తన డిమాండ్లను లేవనెత్తుతామని విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పలువురు విపక్ష పార్టీల నేతలు ఈరోజు మరోసారి మంతనాలు జరిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు