
Revanth reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్’ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్ నగర్ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. గాంధీ జయంతి రోజున నా ఇంటి వద్ద ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని రేవంత్ ప్రశ్నించారు. గృహనిర్బంధం చేస్తే ఆర్డర్ కాపీ చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకోసం అమరుడైన శ్రీకాంత్ చారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.
‘‘ఒక ఎంపీకి నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా? గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. నా గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలి. శ్రీకాంత్ చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్, కేటీఆర్ అనుమతి కావాలి? నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలి. శ్రీకాంత్ చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్, కేటీఆర్‌కు కోపమెందుకు? కేసీఆర్ తప్ప శ్రీకాంత్ చారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా? నన్ను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే నేను వెనుదిరుగుతా. గాంధీ జయంతి రోజున ఎంపీ కార్యక్రమాలను అడ్డుకుంటారా?’’ అని పోలీసులపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఇంటి వద్దే రేవంత్‌రెడ్డి బైఠాయించారు. కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ముందస్తుగా దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద దుకాణాలు మూసివేయించారు. దిల్‌సుఖ్‌నగర్ చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులను ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు.
ఏడేళ్లుగా కొత్త ఉద్యోగాలు లేవు: రేవంత్‌రెడ్డి
పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే బైఠాయించిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. కొత్తవి దేవుడెరుగు.. పాతవి కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఉద్యో్గాలు భర్తీ చేయడంలేదు. ఎందుకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడంలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ 65 రోజుల పోరాటానికి పూనుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ లోని శ్రీకాంత్ చారి విగ్రహం వరకు ర్యాలీ తీయాలనుకున్నాం. కానీ, వందలాది మంది పోలీసులతో అడ్డుకుంటున్నారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.