Rahul Gandhi: వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాతే.. అమేఠీలో రాహుల్‌ పోటీపై నిర్ణయం..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో.. కాంగ్రెస్(Congress) తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌లో అమేఠీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. 

Updated : 10 Apr 2024 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీ (Amethi)లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు బరిలో నిల్చుంటారు..? రాహుల్ (Rahul Gandhi) మరోసారి  భాజపా నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొంటారా..? లేక తన సోదరి ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారా..? ఇంతవరకు ఈ విషయాల్లో ఎలాంటి స్పష్టత లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విపక్ష ‘ఇండియా’ కూటమితో సీట్ల సర్దుబాటులో అమేఠీ స్థానం కాంగ్రెస్‌కే దక్కింది. తనతో మళ్లీ పోటీ పడాలని రాహుల్‌కు ఇరానీ సవాలు విసురుతున్నా.. ఇంతవరకు హస్తం పార్టీ తరఫున అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. గతంలో విజయం సాధించిన కేరళలోని వయనాడ్ నుంచే ఆయన మరోసారి బరిలో నిలిచారు. అయితే రాజకీయాల్లో టైమింగ్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 26న వయనాడ్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాతే.. అమేఠీలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఐదో విడతలో భాగంగా మే 20న అక్కడ ఓటింగ్ జరగనుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.

మమత X మోదీ.. ఉత్కంఠ రేపుతున్న బెంగాల్‌ బరి

ప్రస్తుతం కాంగ్రెస్‌ వయనాడ్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టింది. స్థానికంగా మరింత మద్దతు కూడగట్టి.. 2019 విజయాన్ని పునరావృతం చేయాలని యోచిస్తోంది. మరోపక్క.. అమేఠీలో రాహుల్ పోటీ చేస్తే, హస్తానికి అనుకూలంగా పరిస్థితి మారుతుందని పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడించాయి. ఇప్పటికే గాంధీ కుటుంబంతో భావోద్వేగంగా ముడిపడి ఉన్న ఆ ప్రాంతంలో ఇతర నేతలు బరిలో దిగితే.. అంతర్గత వైరానికి దారితీయొచ్చని కార్యకర్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల మధ్య రాహుల్ పోటీపై స్పష్టత రావాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని