Andhra News: విశాఖ రాజధాని కోసం జేఏసీ ఉద్యమం.. రాజీనామాలకు సిద్ధమన్న వైకాపా

విశాఖలో పరిపాలనా రాజధానికి మద్దతుగా వికేంద్రీకరణను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయేతర ఐకాస నిర్ణయించింది. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి లజపతిరాయ్‌ కన్వీనర్‌గా, ఉపాధ్యాయ సంఘం నేత దేముడు సహ కన్వీనర్‌గా ఐకాస పనిచేయనుంది.  

Updated : 08 Oct 2022 16:49 IST

విశాఖపట్నం: విశాఖలో పరిపాలనా రాజధానికి మద్దతుగా వికేంద్రీకరణను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయేతర ఐకాస నిర్ణయించింది. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి లజపతిరాయ్‌ కన్వీనర్‌గా, ఉపాధ్యాయ సంఘం నేత దేముడు సహ కన్వీనర్‌గా ఐకాస పనిచేయనుంది. వివిధ రంగాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను రాజధానిగా చేయాలని నేతలు కోరారు. పోరాటాలతోనైనా రాజధాని సాధించుకోవాలని నేతలు తీర్మానించారు. ఈనెల 15న విశాఖ గర్జన పేరుతో ఐకాస ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్న అంశాన్ని ఈ ర్యాలీ ద్వారా చాటి చెప్పాలని ఐకాస పిలుపునిచ్చింది. విశాఖలోని ఎల్‌ఐసీ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కనీసం 3 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా విశాఖ రాజధానిగా ఏర్పాటవుతున్న వేళ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా అమరావతి-అరసవల్లి యాత్రను రైతులు నిర్వహిస్తున్నారని అన్నారు. రైతులు అమరావతితో పాటు విశాఖకు మద్దతు ప్రకటిస్తే వారిని తామే స్వయంగా అరసవెల్లి తీసుకెళ్తామని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. 

రాజీనామాలు చేద్దాం రండి..

విశాఖ రాజధానికోసం రాజీనామాలకు సిద్ధమని వైకాపా నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకేసి రాజీనామా లేఖను ఐకాస కన్వీనర్‌కి అందజేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ప్రాంతంలో ఎవరూ రాజధాని కోరుకోవడంలేదని అవమానకరంగా మాట్లాడారని ఆక్షేపించారు. ఈ ప్రాంతంలో ప్రజల మనోభావాలను వెల్లడించేందుకే రాజధానుల అంశంపై ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్దామని సవాల్‌ చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా అవసరమైతే రాజీనామాకు సిద్ధమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని