Assembly Polls: తృణమూల్‌ వల్ల భాజపాకే అనుకూలం : సంజయ్‌ రౌత్‌

గోవాలో కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక నినాదం తీసుకున్న టీఎంసీ వల్ల అక్కడ భాజపాకే అధిక ప్రయోజనం చేకూరనుందని జోస్యం చెప్పారు.

Updated : 10 Aug 2022 11:43 IST

గోవా ఎన్నికలపై శివసేన ఎంపీ

ముంబయి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విరుచుకుపడ్డారు. గోవాలో కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక నినాదం తీసుకున్న టీఎంసీ వల్ల అక్కడ భాజపాకే అధిక ప్రయోజనం చేకూరనుందని జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి విశ్వసనీయత లేని నాయకులకు టీఎంసీ చేర్చుకుంటోందని.. భాజపాపై పోరాటం చేస్తోన్న మమతా బెనర్జీకి అలాంటి వైఖరి సరిపోదని వ్యాఖ్యానించారు. రోహ్‌తక్‌ పేరుతో శివసేన మానస పుత్రిక సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో గోవా రాజకీయాలపై సంజయ్‌ రౌత్‌ ఈవిధంగా స్పందించారు.

‘గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఎంసీ విపరీతంగా ఖర్చు చేస్తోంది. ఇందుకు పార్టీ నిధులు ఎక్కడనుంచి వస్తున్నాయో చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే.. రాజకీయ పార్టీలన్నీ గోవాను ఓ ‘పొలిటికల్‌ లేబొరేటరీ’గా మార్చాయి. గోవాలో టీఎంసీ ప్రవేశించడం వల్ల ఎక్కువగా భాజపాకే ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విశ్వసనీయత లేని నాయకులను ఇతర పార్టీల నుంచి మమతా బెనర్జీ చేర్చుకుంటున్నారు. ఇది ఆమె ఇమేజ్‌కు సరిపోదు’ అంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 17 స్థానాల్లో గెలుపొంది అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. ప్రస్తుతం రెండు స్థానాలకు పడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందుకు అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడమే కారణమన్న ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం భాజపాకు కూడా కష్టమేనన్నారు. కానీ, ఆప్‌, టీఎంసీలు కాంగ్రెస్‌ పార్టీకి అడ్డంకులు సృష్టించడం వల్ల అది చివరకు భాజపాకే సహాయపడుతుందని సంజయ్‌ రౌత్‌ జోస్యం చెప్పారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చూస్తోన్న రాజకీయ పార్టీలు తాజాగా గోవాపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ భాజపా, కాంగ్రెస్‌, గోవా ఫార్వర్డ్‌ పార్టీ (GFP), మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, ఎన్‌సీపీతో పాటు దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ, పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌లు రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు