Tamil Nadu: తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?.. స్టాలిన్‌ ఏమన్నారంటే..!

ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారాన్ని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ఖండించారు.

Updated : 13 Jan 2024 17:14 IST

చెన్నై: తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi stalin)కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) ఖండించారు. అవి కేవలం సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో పుట్టించిన వదంతులను కొట్టి పారేశారు. తన ఆరోగ్యంపైనా కొంతమంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ‘‘నేను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నాను. విధులు నిర్వహిస్తున్నాను’’ అని పొంగల్‌ శుభాకాంక్షల సందేశంలో తెలిపారు.

జనవరి 21న సేలంలో ఉదయనిధి ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎంకే యువజన విభాగం సమావేశాన్ని వ్యతిరేకిస్తోన్నవారు ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నట్లు సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువత ‘సేలం సదస్సు’కు సిద్ధమవుతున్న తరుణంలో.. తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అలాంటప్పుడు తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కుమారుడికి బాధ్యతలు.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌..?

ఈ వార్తలను ఉదయనిధి స్టాలిన్‌ ఇప్పటికే తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమేనని జాతీయ మీడియాకు తెలిపారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఉద్దేశించిన యువజన విభాగం సదస్సు నుంచి అందరి దృష్టి మరల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు దీన్ని అనుమతించకూడదన్నారు. రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదాన్ని పరిరక్షించడమే ఈ సదస్సు ఉద్దేశమని, దీన్ని వ్యతిరేకించే వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని