Tamilnadu Politics: కుమారుడికి బాధ్యతలు.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌..?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని అధికారపార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated : 09 Jan 2024 15:41 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi stalin)డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈలోపే కుమారుడికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జనవరి 21న సేలంలో పార్టీ యూత్‌ వింగ్‌ (యువ విభాగం) సమావేశం జరగనుంది. ఈ వేదికపైనే ఉదయనిధిని డిప్యూటీగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనిపై ఆ పార్టీ కార్యదర్శి టీకేఎస్ ఇలాంగోవన్‌ స్పందించారు. తనకు స్పష్టమైన సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఉదయనిధి పనితీరును ప్రశంసించారు. మంత్రిగా బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని కితాబిచ్చారు. అయితే, డిప్యూటీ సీఎం పదవి ఆయనకు ఇస్తారా? లేదా అన్నది మాత్రం సీఎం చేతుల్లోనే ఉందని చెప్పారు. మరోవైపు, అ వార్తలను ఉదయనిధి స్టాలిన్‌ కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమేనని జాతీయ మీడియాకు తెలిపారు. 

తాజా పరిణామాలు గాలి వార్తలు కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవేనని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధికి టికెట్‌ కేటాయించినప్పుడే డిప్యూటీ సీఎం ఇవ్వాలని నిర్ణయించారని, వెంటనే ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తొలుత మంత్రి పదవి ఇచ్చి, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి హోదా కల్పిస్తున్నారని విమర్శించింది. 2026 ఎన్నికల్లో అతడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారానికి వెళ్తారని తెలిపింది. ప్రజాస్వామ్య ముసుగులో వారసత్వపాలనకు డీఎంకే పార్టీయే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడింది. తాత, తండ్రి, మనవడు ఇలా ఆ ఒక్క కుటుంబం చేతిలోనే అధికారం ఉంటోందని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్‌ దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని