Agnipath scheme: ‘అగ్నిపథ్‌’ తప్పనిసరి కాదు.. ఎంతో ఆలోచించి తీసుకొచ్చాం

సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు

Updated : 17 Jun 2022 15:27 IST

సికింద్రాబాద్‌ ఘటనపై స్పందించిన కిషన్‌ రెడ్డి

దిల్లీ: సుదీర్ఘ ఆలోచనలు, ఎన్నో చర్చల తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath) విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. సికింద్రాబాద్‌లో పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే ‘అగ్నిపథ్‌’ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు

‘అగ్నిపథ్‌’ తప్పనిసరి కాదు.. 

‘‘ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్‌’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరవచ్చు.. ఇందులో బలవంతం లేదు. దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే ‘అగ్నిపథ్‌’లో పాల్గొంటారు. ఇజ్రాయిల్‌లో 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. భారత్‌లో ఈ పథకాన్ని తప్పనిసరి చేయట్లేదు. ‘అగ్నిపథ్‌’ వీరుడు బయటకు వచ్చాక 10 మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

పోలీసులు ఎందుకు రాలేదు..?

కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తే దాడులు జరగడం దురదృష్టకరం. ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణం. సికింద్రాబాద్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. స్టేషన్‌ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్‌లు తగలబెట్టారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు.. సంయమనం పాటించాలి. రైల్వే కోచ్‌లకు కూడా నిప్పుపెట్టారు.. బోగీలన్నీ ధ్వంసమయ్యాయి. ఇన్ని జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదు. 

చర్చలకూ సిద్ధమే..

నిన్న రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళన జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు సకాలంలో పట్టించుకోలేదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.  ‘అగ్నిపథ్‌’ పథకం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించి తీసుకొచ్చాం. ‘అగ్నిపథ్‌’పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతోనూ చర్చలకు సిద్ధమే. సికింద్రాబాద్‌ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని కిషన్‌ రెడ్డి సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు