venkaiah Naidu: కొంతమంది నాయకుల తీరు అసహ్యంగా ఉంది: వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతిగా కంటే వెంకయ్య నాయుడుగా గుర్తిస్తేనే తనకు ఆనందంగా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు అన్నారు.

Published : 04 Oct 2023 20:12 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పని చేసిన దేవేందర్‌ గౌడ్‌.. రాజ్యసభలో చేసిన ప్రసంగాలు, వారు కేబినెట్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ శాసనసభలో చేసిన ప్రసంగాలతో వెలువరించిన పుస్తకాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవేందర్ గౌడ్ చేసిన ప్రసంగాలు, సభ్యుల ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలతో తీసుకొచ్చిన ఈ పుస్తకాలను చదివినప్పుడు, వారు ఎంత హుందాగా, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారో అర్థమవుతుందన్నారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఉప రాష్ట్రపతి కంటే వెంకయ్య నాయుడుగా నన్ను గుర్తిస్తేనే నాకు ఆనందం. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను.. ప్రజా జీవనంలో ఉన్నాను. పార్టీలు, రాజకీయాలపై వ్యాఖ్యానించను. ఎప్పుడూ పార్టీని చూడొద్దు. విషయాన్ని, ప్రాధాన్యతను చూడాలి. వెనకబడిన వర్గాల కోసం ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడ్డారు. రాజకీయాల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డ వ్యక్తి ఎన్టీఆర్. దేవేందర్ గౌడ్ తన విలువైన అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసహ్యంగా ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నాయకులను ఎన్నుకోవాలి. రాజకీయాల్లో ప్రజా జీవనం ఉంది. సత్తా ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. దేశంలో, రాష్ట్రంలో గట్టి ప్రతిపక్షం ఉండాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని