
ఆవేదనతోనే ఆ వ్యాఖ్యలు: కోమటిరెడ్డి
భువనగిరి: టీపీసీసీ అధ్యక్షుడిగా తనను కాదని రేవంత్‌రెడ్డిని నియమించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. తనకు పీసీసీ పదవి రాలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానన్నారు. సీనియర్ నేతగా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా భువనగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. ఏ పార్టీలో చేరను. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతాం. గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం. ప్రజలతో మమేకమై గ్రూపులు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం. కేసీఆర్‌ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలి’’ అని తెలిపారు.
‘‘అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుంది. అంత మాత్రాన పార్టీ మారతారా ?తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేసిన వ్యక్తిని నేను. నాకు ఏ పదవి అవసరం లేదు. భువనగిరి ఎంపీగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను గెలిపించారు’’ అని కోమటిరెడ్డి అన్నారు.
ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు దిల్లీ వెళ్లాక తెలిసిందని కోమటిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పలువురు నేతలు ఆంగ్లంలోకి అనువదించి హైకమాండ్‌కు పంపారు.