Parliament: ఆ ఘటన నన్నెంతో బాధించింది: ఓం బిర్లా

సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు కొందరు నిన్న సభలో ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో బాధించిందని ......

Published : 30 Jul 2021 01:16 IST

దిల్లీ: పార్లమెంట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘటనలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు కొందరు నిన్న సభలో ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో బాధించిందని వ్యాఖ్యానించారు. సభాపతి స్థానం (ఛైర్‌) వైపు ప్లకార్డులు, కాగితాలను చింపి విసరడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోక్‌సభలో నిన్న కాంగ్రెస్‌ ఎంపీలు గుర్జీత్‌ ఆజ్లా, టీఎన్‌ ప్రతాపన్‌, హిబి ఇడెన్‌ సహా కొందరు సభ్యులు  పేర్లను చింపి సభాపతి స్థానం వైపు విసరడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కొందరు సభ్యులు విసిరిన ప్లకార్డులు స్పీకర్‌ పొడియం పైన ఉన్న ప్రెస్‌ గ్యాలరీలో పడ్డాయి. దీంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభా కార్యకలాపాలు మొదలైనా విపక్ష సభ్యులు నినాదాలతో అడ్డుకోవడంతో గురువారానికి వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో గురువారం లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. జులై 28న సభలో చోటు చేసుకున్న ఘటన తనను బాధించిందన్నారు. పేపర్లు చింపేసి విసరడం సభాపతి స్థానాన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పార్లమెంట్‌ హుందా తననాన్ని దిగజార్చడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సంప్రదాయాలను పాటించకపోతే పార్లమెంటరీ ప్రక్రియ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించారు. సభ్యులంతా తమ సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కల్పిస్తామన్నారు. అందరూ పార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ తరహా ఘటనలు మరోసారి పునరావృతం కావొద్దని సూచించారు. పార్లమెంట్‌ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

‘‘లోక్‌సభను ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తాం. సభాపతి స్థానం అందరికీ న్యాయం చేస్తుంది.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఏవైనా ప్రశ్నలుంటే నా గదికి వచ్చి చెప్పవచ్చు. సభాపతి స్థానం గౌరవాన్ని కాపాడేందుకు మీ సలహాలను పాటించేందుకు ప్రయత్నిస్తాను. కానీ, సభ హుందాతనాన్ని పెంచేలా మనమంతా సమష్టి నిర్ణయం తీసుకోవాలి’’ అని ఓం బిర్లా సభ్యులను కోరారు.

మరోవైపు, పెగాసస్‌‌ స్పైవేర్‌తో పలువురి ఫోన్లపై నిఘా ఉంచడం, వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. దీంతో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని