
UP elections: మేం ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం: మాయావతి
లఖ్‌నవూ: మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కాగా.. బహుజన సమాజ్‌వాది పార్టీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం.. ఒప్పందాలు కుదుర్చుకోం. సొంతంగానే పోటీ చేస్తాం. మేం అన్ని వర్గాల ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. ఆ పొత్తే శాశ్వతంగా ఉంటుంది. 2007 ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తాం’’ అని మాయావతి వెల్లడించారు. అలాగే, సమాజ్‌వాది, భాజపాలపై మాయావతి విమర్శలు గుప్పించారు. ఎస్పీ, భాజపా మధ్య తేడా ఏమీ లేదని, అవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్యాలు అని అన్నారు. ఈ ఎన్నికలను ఆ రెండు పార్టీలు కేవలం హిందూ-ముస్లింలకు సంబంధించినదిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు నమ్మబోరని మాయావతి అన్నారు. ‘‘ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో 50 శాతం నెరవేర్చినా.. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు’’ అని మాయావతి ఎద్దేవా చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 నియోజకవర్గాలకు గానూ భాజపా 312 చోట్ల విజయం సాధించి అధికారం దక్కించుకుంది. సమాజ్‌వాది పార్టీ 47 స్థానాల్లో, బహుజన్ సమాజ్‌వాది 19 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది.