Mamata Banerjee: అలాగైతే కాంగ్రెస్‌తో జట్టు కట్టం.. దీదీ కీలక వ్యాఖ్యలు

విపక్షాల భేటీ వేళ కాంగ్రెస్‌తో పొత్తుపై మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ దీదీకి వ్యతిరేకంగా సీపీఎంతో జట్టుకట్టడమే ఇందుక్కారణం.

Published : 17 Jun 2023 13:42 IST

కోల్‌కతా: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో (2024 Lok sabha elections) భాజపా (BJP)ను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించేందుకు విపక్షాలు భేటీ కానున్న వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎం (CPM)తో కాంగ్రెస్‌ (Congress) పొత్తు పెట్టుకున్నంతవరకు హస్తం పార్టీతో తాము జట్టుకట్టబోమని స్పష్టం చేశారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంకు ప్రధాన మిత్రపక్షంగా ఉంది. ఈ పార్టీలు రాష్ట్రంలో భాజపా (BJP)కు స్నేహపక్షాలే. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ మా సాయం కోరుతోంది. భాజపాను ఎదుర్కొనేందుకు అందుకు మేం సిద్ధమే. అయితే, రాష్ట్రంలో సీపీఎంతో మీరు పొత్తు పెట్టుకున్నంతవరకూ.. లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) సాయం కోసం మా వద్దకు రాకండి’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ దీదీ వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌ రాజధాని పట్నా వేదికగా జూన్‌ 23న భాజపా వ్యతిరేక పక్షాల సమావేశం (Opposition Meet) జరగనున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీపీఎం పార్టీ నేతలు సహా ఇతర విపక్ష నేతలు పాల్గొననున్నారు. అయితే, బెంగాల్‌లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఎం కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. దీంతో భాజపా, టీఎంసీ, సీపీఎం మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో దీదీ కాంగ్రెస్‌ పొత్తుపై విమర్శలు గుప్పించారు.

మరోవైపు, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై కూడా దీదీ స్పందించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, ఎన్నికలను అడ్డుకోవాలని భాజపా, కాంగ్రెస్‌, సీపీఎం భావిస్తున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు జులై 11న ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని