Mamata Banerjee: ఇన్నాళ్లూ నా పార్టీ.. ఇప్పుడు నా కుటుంబం: భాజపాపై దీదీ మండిపాటు

పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై మండిపడ్డారు.  ఇన్నాళ్లూ తన పార్టీనాయకులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేసిన కాషాయ పార్టీ ఇప్పుడు.. తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు.

Published : 20 May 2023 01:43 IST

కోల్‌కతా: భాజపాపై పశ్చిమ్‌బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) అధినేత్రి మమతాబెనర్జీ (Mamata Benarjee) నిప్పులు చెరిగారు. ఇన్నాళ్లూ తన పార్టీని నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు కొనసాగించిన భాజపా.. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులే లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. ఇందులో భాగంగానే పార్టీ జనరల్‌ సెక్రెటరీ, తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసిందని అన్నారు. బంకురాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమతాబెనర్జీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణం కేసులో శనివారం కోల్‌కతా నిజాం ప్యాలస్‌లోని కార్యాలయానికి విచారణకు హాజరు కావాంటూ సీబీఐ అభిషేక్‌ బెనర్జీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బంకురా పర్యటనలో ఉన్న అభిషేక్‌ కోల్‌కతాకు పయనమయ్యారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ వర్చువల్‌గా మాట్లాడారు.‘‘ మా పార్టీలోని నేతలందరిపై దర్యాప్తు సంస్థల దాడులు పూర్తయ్యాక.. భాజపా దృష్టి నా కుటుంబంపై పడింది. అయినా భయపడేది లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో నోటీసులు జారీ చేయించడం తప్ప భాజపా ఇంకేం చేయగలదు.’’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తృణమూల్‌ చేపట్టిన యాత్ర విజయవంతమవుతుందనే భయంతోనే భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్రంలో భాజపాను గద్దె దించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని