Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?

మధ్యప్రదేశ్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది.

Updated : 24 Oct 2023 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికలనగానే రాజకీయ పార్టీల ప్రచార హోరు.. హమీల జోరు అంతా ఇంతా కాదు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షంలో ఉన్నవారు తమ బంధువులైనా, స్నేహితులైనా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రత్యర్థులే. మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh Elections) కొందరు అభ్యర్థులకు సరిగ్గా ఇవే పరిస్థితులే ఎదురవుతున్నాయి. అన్నదమ్ములు, మామఅల్లుళ్లు, బావామరదళ్లు ప్రత్యర్థులుగా మారారు. దీంతో పార్టీల మధ్య పోటీ కాస్త.. ఆయా నియోజకవర్గాల్లో కుటుంబ పోరుగా మారింది.

అన్నదమ్ముల మధ్యపోరు

హోషంగాబాద్‌ నియోజకవర్గం భాజపా కంచుకోట. గత 3 దశాబ్దాలుగా ఈ స్థానంలో కాషాయ జెండాయే ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజాగా గిరిజా శంకర్‌ శర్మ, సీతాశరణ్‌ శర్మ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ స్థానానికి పోటీపడుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసిన వీరిద్దరూ తాజాగా ప్రత్యర్థులుగా మారి భాజపా, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. 73 ఏళ్ల గిరిజాశంకర్‌ 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 2 సార్లు విజయం సాధించారు. నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఆయన తమ్ముడు 69 ఏళ్ల సీతాశరణ్‌ ఇదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990, 1993, 1998, 2013, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. 

2018 ఎన్నికల నుంచే ఈ అన్నదమ్ముల మధ్య విరోధం మొదలైంది. 2018 ఎన్నికల్లో తొలుత గిరిజా శంకర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేట్‌ చేసిన భాజపా అధిష్ఠానం.. అంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకొని సీతాశరణ్‌కు టికెట్‌ కేటాయించింది. దీంతో గిరిజా పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చేశారు. కొన్ని నెలల తర్వాత పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి భాజపా గూటికి చేరుకున్నారు. కానీ, భాజపా విధివిధానాలు నచ్చకపోవడంతో 2023 సెప్టెంబర్‌లో గిరిజా శంకర్‌ మళ్లీ ఆ పార్టీకి రాజీనామాచేసి తన మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానాన్ని భాజపా సీతాశరణ్‌కు కేటాయించగా.. కాంగ్రెస్‌ గిరిజా శంకర్‌ను అభ్యర్థిగా నిలిపింది. దీంతో హోషంగాబాద్‌లో ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ ప్రత్యర్థులుగా మారారు. 

మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు

డియోతలాబ్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున గిరీశ్‌ గౌతమ్‌, కాంగ్రెస్‌ తరఫున పద్మేశ్‌ గౌతమ్‌ బరిలోకి దిగుతున్నారు. వీళ్లిద్దరూ మామాఅల్లుళ్లు కావడం గమనార్హం. 70 ఏళ్ల గిరీశ్‌ నాలుగు సార్లు డియోతలాబ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత సీపీఐతో రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆయన.. తర్వాతి కాలంలో భాజపాలో చేరారు. 2003 ఎన్నికల్లో తొలిసారిగా మంగవాన్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే, ఆ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడంతో 2008 ఎన్నికల నుంచి డియోతలాబ్‌ స్థానానికి మారారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వివిధ రాజకీయ కారణాలతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి.. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 ప్రారంభంలో అసెంబ్లీ స్పీకర్‌గానూ సేవలందించారు. పద్మేశ్‌ గౌతమ్‌ ఆయనకు స్వయాన మేనల్లుడు. 9 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 2020లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ గిరీశ్‌ తనయుడు రాహుల్‌ను పద్మేశ్‌ ఓడించారు. 

ఇద్దరూ బంధువులే.. కానీ,

డబ్రా నియోజకవర్గంలో భాజపా తరఫున ఇమర్తిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేశ్‌ రాజేకి పోటీగా ఈమె బరిలో నిలిచారు. వీరిద్దరూ దగ్గరి బంధువులు. ఇమర్తి దేవి అన్నయ్య కూతుర్ని సురేశ్‌ రాజే కుమారుడు వివాహమాడారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ.. రెండుకుటుంబాల సమస్యగా మారింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలిగా ఇమర్తి దేవికి పేరుంది. ఈమె ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. డబ్రా నుంచి 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈమె.. 2020 వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే, 2020లో జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరడంతో.. ఇమర్తి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ రాజే చేతిలో 7,633 ఓట్లతో పరాజయం పాలయ్యారు. అంతకుముందు భాజపా నేతగా ఉన్న సురేశ్‌.. ఇమర్తిదేవి పార్టీలోకి రావడంతో.. ఉపఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరారు. 2013 ఎన్నికల్లో సురేశ్‌ 33,278 ఓట్లతో ఇమర్తి దేవి చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా వీరిద్దరి మధ్య మూడోసారి పోరు జరగనుంది.

బావామరదలి మధ్యే పోటీ..

సాగర్‌ నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున నిధి జైన్‌ బరిలోకి దిగుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా భాజపా శైలేంద్ర జైన్‌కు టికెట్‌ కేటాయించింది. ఇక్కడ నుంచి శైలేంద్ర మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శైలేంద్ర జైన్‌ తమ్ముడు సునీల్‌ జైన్‌ భార్యే నిధి జైన్‌. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్థులుగా మారడంతో.. ఆ నియోజకవర్గ పోరు.. ఆ కుటుంబ పోరుగా మారింది. అయితే, తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని, కేవలం అభిప్రాయ భేదాలవల్లే ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నామని నిధి చెబుతున్నారు. రాజధర్మాన్ని అనుసరించి పోటీ చేస్తున్నానని శైలేంద్ర అంటున్నారు. ఎన్నికల కోసం కార్యకర్తలు పూర్తి స్థాయిలో పని చేయాలని, భాజపా గౌరవాన్ని కాపాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో నెలకొన్న ఈ కుటుంబాల మధ్య పోరులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే.. డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని