YS Sharmila: షర్మిల బస్సు యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు

వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన బస్సు యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆమె ప్రసంగిస్తుండగా  ‘జై జగన్‌’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

Updated : 08 Apr 2024 20:15 IST

దువ్వూరు: వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన బస్సు యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆమె ప్రసంగిస్తుండగా  ‘జై జగన్‌’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి’ అంటూ మండిపడ్డారు. జగన్‌ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఆమె వద్దకు వచ్చి మైకు తీసుకొని చంద్ర ఓబుల్‌రెడ్డి అనే వైకాపా కార్యకర్త మాట్లాడారు. జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రానికి మేలు చేశారని, ఆయనకు సహకరించాలని కోరారు. గతంలో తాను కూడా ‘ జై జగన్‌’ అన్నానని, 3,200 కి.మీ పాదయాత్ర చేశానని షర్మిల చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నా అనే వాళ్లను, రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారు’ అని వివరించారు. 

‘‘ ఒకప్పుడు నేనూ ‘ జై జగన్’ అనే వ్యక్తినే. వైయస్‌ఆర్‌ ఆశయాల్ని జగన్‌ నిలబెడతారు అనుకున్నా.  రాష్ట్ర అభివృద్ధిపై మాట తప్పుతారనుకోలేదు. మద్యనిషేధం అన్నారు.. అమలయ్యిందా ? ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నారు.. పోరాడారా? పోలవరం కడతాం అన్నారు... కట్టారా? రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా? ఇచ్చిన మాటపై నిలబడటం వైయస్‌ఆర్‌ లక్షణం. మాట తప్పిన జగన్‌ను ఏమనాలి?’’ అంటూ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఆమె అడిగిన సూటి ప్రశ్నలకు వైకాపా కార్యకర్తలు తోక ముడుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ కాంగ్రెస్‌ అభిమానులు నినాదాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని