ఒమిక్రాన్‌ విజృంభణ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌... తాజాగా మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి బయటపడ్డ ఈ వేరియంట్‌ ఇప్పటివరకూ 36 దేశాలకు వ్యాపించింది. 

Updated : 04 Dec 2021 12:18 IST

అగ్రరాజ్యంలో మరింతగా వ్యాప్తి
న్యూయార్క్‌లో కొత్తగా 5 కేసులు

న్యూయార్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌... తాజాగా మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి బయటపడ్డ ఈ వేరియంట్‌ ఇప్పటివరకూ 36 దేశాలకు వ్యాపించింది. అమెరికాలో మొత్తం ఐదు రాష్ట్రాలు దీని బారిన పడ్డాయి. న్యూయార్క్‌లో శుక్రవారం ఒక్కరోజే అయిదు కేసులు నమోదయ్యాయి! దీంతో అగ్రరాజ్యంలో ఈ తరహా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

అనేక ఉత్పరివర్తనాలు సంతరించుకున్న కారణంగా ఒమిక్రాన్‌ చాలా వేగంగా, సమర్థంగా వ్యాపిస్తున్నట్టు న్యూయార్క్‌ నగర మేయర్‌ బిల్‌ దే బ్లాసియో పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ సోకిన బాధితుల్లో కొందరు అసలు ఇళ్లలోంచి బయటకే రాలేదని... దీన్ని బట్టి అమెరికాలో ఇంతకుముందే ఈ వేరియంట్‌ వ్యాపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌... డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా  వ్యాపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికైతే స్వల్ప లక్షణాలే...

సింగపుర్‌లో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొత్త వేరియంట్‌ సోకినట్టు తాజాగా నిర్ధారణ అయింది. వారిని ప్రత్యేకంగా ఉంచి, చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు వైద్య అధికారులు తెలిపారు. మలేసియాలో శుక్రవారం తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 19 ఏళ్ల విదేశీ యువతికి ఈ వేరియంట్‌ సోకినట్టు వైద్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్‌ తెలిపారు. ఆమెతో పాటు ఉన్న నలుగురిని క్వారంటైన్‌కు తరలించారు. దక్షిణ కొరియాలో కొత్త వేరియంట్‌ కేసులు ఆరుకు చేరాయి. బాధితులంతా ఇటీవల నైజీరియా నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు.

దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బృందం :మహమ్మారి వ్యాప్తి కట్టడి కోసమే.. 

జొహానెస్‌బర్గ్‌: కరోనా కొత్త వేరియంట్‌- ఒమిక్రాన్‌ దెబ్బకు వణికిపోతున్న దక్షిణాఫ్రికాకు సాయం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరో అడుగు ముందుకేసింది. ఆ దేశంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గౌటెంగ్‌ ప్రావిన్సుకు తాజాగా నిపుణుల బృందాన్ని పంపించింది. వైరస్‌ వ్యాప్తిపై నిఘా ఉంచి, బాధితులను త్వరితగతిన గుర్తించడం ద్వారా మహమ్మారిని కట్టడి చేయడంలో వారు స్థానిక ప్రభుత్వానికి చేయూతనందించనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్‌ ఎమెర్జెన్సీ డైరెక్టర్‌ డాక్టర్‌ సలామ్‌ గ్వెయె తెలిపారు. కొవిడ్‌ కేసుల జన్యు విశ్లేషణ కోసం తమ బృందం ఒకటి ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న సంగతిని గుర్తుచేశారు. దక్షిణాఫ్రికాలో గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 80%.. ఒక్క గౌటెంగ్‌ ప్రావిన్సులోనివే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని