Jagdeep Dhankhar:పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎస్‌కు గవర్నర్‌ ధన్‌ఖడ్‌ హెచ్చరిక

విపక్ష నేత సువేందు అధికారి పర్యటనను పోలీసులు  అడ్డుకోవడంపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం

Updated : 20 Jan 2022 10:04 IST

కోల్‌కతా: విపక్ష నేత సువేందు అధికారి పర్యటనను పోలీసులు  అడ్డుకోవడంపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ వ్యవహారంపై వారంలో సమాధానమివ్వాలని, లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారదర్శి(సీఎస్‌) హెచ్‌.కె.ద్వివేదీని గవర్నర్‌ తాజాగా హెచ్చరించారు. ఇదే అంశంపై తన ఎదుట హాజరుకావాలని గవర్నర్‌ ధన్‌ఖడ్‌ ఇప్పటికే రెండు సార్లు (ఈ నెల 8,12 తేదీల్లో) సీఎస్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, కొవిడ్‌ ఐసోలేషన్‌ నిబంధనల సాకుతో ద్వివేదీ హాజరు కాలేదు. దీంతో మరోసారి మంగళవారం రెండు పేజీల లేఖ రాశారు. ‘‘ఇదే చివరి అవకాశం.

సువేందును పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో సమగ్ర సమాధానమివ్వాలి. ఈ లేఖ అందుకున్న ఏడు రోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించాలి. లేదంటే చట్టబద్ధమైన విధులను, అఖిల భారత సర్వీసు నిబంధనలను ధిక్కరించినట్లుగా భావించాల్సి ఉంటుంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి’’ అని ఆ లేఖలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ హెచ్చరించారు. ఈ నెల ఏడో తేదీన పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌ జిల్లా నెతాయి గ్రామానికి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సువేందును అడ్డుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ పోలీసులు వాటిని ఎందుకు ధిక్కరించాల్సి వచ్చిందో తన ఎదుట హాజరై వివరించాలని గవర్నర్‌ ధన్‌ఖడ్‌ రాష్ట్ర సీఎస్‌ ద్వివేదీని, డీజీపీ మనోజ్‌ మాలవీయను ఇప్పటికే రెండుసార్లు ఆదేశించారు. ఆ అధికారులు ఇద్దరూ దాన్ని పాటించకపోవడంతో తాజా లేఖను సంధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని