‘ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లకు ఇషాన్‌, సూర్యకుమార్‌’

ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌కు త్వరలోనే టీమ్‌ఇండియా పిలుపు వస్తుందని...

Published : 12 Dec 2020 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌కు త్వరలోనే టీమ్‌ఇండియా పిలుపు వస్తుందని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నిరాశపర్చడంతో.. ఆ ముంబయి బ్యాట్స్‌మెన్‌ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడానికి ఎంత దూరంలో ఉన్నారని ఓ నెటిజన్‌ చోప్రాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మాజీ క్రికెటర్‌ అదెంతో దూరంలో లేదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకోలేదని, మరోవైపు శ్రేయస్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని బదులిచ్చాడు.

అలాగే మనీష్‌ పాండే సైతం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడని చెప్పాడు. దాన్ని బట్టి ఇషాన్‌, సూర్య త్వరలోనే టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలిపాడు. అది కూడా ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంపికవుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2020 ఐపీఎల్‌లో ఆడినట్లే వచ్చే సీజన్‌లోనూ వారిద్దరు చెలరేగితే కచ్చితంగా టీమ్‌ఇండియా తరఫున ఆడతారన్నాడు. కాగా, గత నెల యూఏఈలో పూర్తి అయిన టీ20 మెగా లీగ్‌లో ఇషాన్‌ 4 అర్ధశతకాలతో 516 పరుగులు చేయగా, సూర్యకుమార్‌ అన్నే హాఫ్‌ సెంచరీలతో 480 పరుగులు చేశాడు. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ టీమ్‌ఇండియాను 3 జట్లుగా ప్రకటించగా సూర్య తనకు అవకాశం వస్తుందని భావించాడు. కానీ అలా జరగలేకపోవడంతో అతడు బాధపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమ్‌ఇండియా తొలుత వన్డే సిరీస్‌లో ఓటమిపాలైనా తర్వాత టీ20 సిరీస్‌లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో నాలుగు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఆడనుంది. ఆపై ఇంగ్లాండ్‌తో 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లను బీసీసీఐ ఇటీవలే ఖరారు చేసింది.

ఇవీ చదవండి..

ఇప్పుడైనా  ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?  

తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ

నీ ప్రయాణం అజరామరం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని