మళ్లీ.. బ్యాడ్మింటన్‌ కోర్టులోకి సింధు, సైనా

బ్యాడ్మింటన్‌ అభిమానులకు శుభవార్త! భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తారలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ తిరిగి రాకెట్‌ పట్టుకోనున్నారు. త్వరలో జరిగే మూడు టోర్నీల్లో వారు పోటీ పడనున్నారు.  ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, బ్యాంకాక్‌ ఓపెన్‌ సైతం...

Published : 21 Dec 2020 17:19 IST

కరోనా విరామం తర్వాత తొలిసారి పోటీపడుతున్న క్రీడాకారులు

దిల్లీ: బ్యాడ్మింటన్‌ అభిమానులకు శుభవార్త! భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తారలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ తిరిగి రాకెట్‌ పట్టుకోనున్నారు. త్వరలో జరిగే మూడు టోర్నీల్లో వారు పోటీ పడనున్నారు.  ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, బ్యాంకాక్‌ ఓపెన్‌ సైతం అందులో ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఎనిమిది మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.

గత ఒలింపిక్స్‌ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, బి.సాయి ప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప, ఎన్‌.సిక్కిరెడ్డి ఈ జట్టులో ఉన్నారు. జనవరి 12-17 మధ్య జరిగే థాయిలాండ్‌ ఓపెన్‌తో వీరు తమ ప్రస్థానాన్ని తిరిగి ఆరంభిస్తారు. ఆ తర్వాత బ్యాంకాక్‌ ఓపెన్‌ (జనవరి 19-24), బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (జనవరి 27-31)లో పోటీపడతారు. వీరితో పాటు వ్యక్తిగత కోచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రైనర్లూ అక్కడికి వెళ్లనున్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి బ్యాడ్మింటన్‌ టోర్నీలన్నీ రద్దు లేదా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఒక టోర్నీ జరిగినా ఆటగాళ్లే రిస్క్‌ చేసి వెళ్లారు. భారత్‌ నుంచి కేవలం కిదాంబి శ్రీకాంత్‌ ఒక్కడే అక్టోబర్లో డెన్మార్క్‌ ఓపెన్‌లో తలపడ్డాడు.

‘మళ్లీ బ్యాడ్మింటన్‌ సందడి మొదలవ్వడం ఆనందంగా ఉంది. సమీప భవిష్యత్తులో టోర్నీలు వరుసగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. 7-8 నెలలుగా మా క్రీడాకారుల్లో చాలామంది ఏ టోర్నీల్లో పాల్గొనలేదు. అయితే శిబిరాల్లో మాత్రం శిక్షణ పొందుతున్నారు. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు ముందు సాధన లభిస్తుందనే పూర్తి జట్టును పంపిస్తున్నాం’ అని బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియా అన్నారు.

ఇవీ చదవండి
నిన్నెప్పటికీ ప్రేమిస్తుంటా: రోహిత్‌ శర్మ
బాక్సింగ్‌ డే టెస్టుకు ‘ఆ నలుగురు’ 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని