అదో విలాసవంతమైన జైలు: రబాడ

బయోబబుల్‌లో ఉండటం అంటే విలాసవంతమైన జైలులో ఉన్నట్లని దక్షిణాఫ్రికా పేసర్ రబాడ అన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో ఆటగాళ్లు బయోబబులో ఉన్న సంగతి తెలిసిందే.

Published : 24 Nov 2020 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్: బయో బబుల్‌లో ఉండటం అంటే విలాసవంతమైన జైలులో ఉన్నట్లని దక్షిణాఫ్రికా పేసర్ రబాడ అన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో ఆటగాళ్లు బయోబబులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, దిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించిన రబాడ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దాదాపు రెండు నెలల పాటు బుడగలో ఉన్న అతడు తన అనుభవాలు పంచుకున్నాడు.

‘‘బయో బుడగ‌లో ఉండటం కష్టతరమే. ఎక్కువమందిని కలవలేరు. మీ స్వేచ్ఛని కోల్పోతారు. అదో విలాసవంతమైన జైలులా ఉంటుంది. అయితే అది మా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కానీ మేం ఇష్టమైన పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం. గొప్ప అవకాశం ఇది. సౌకర్యవంతమైన హోటల్లో, రుచికరమైన ఆహారాన్ని తీసుకున్నాం. కానీ నాలుగు గోడల మధ్యలో ఉండటం మానసికంగా కాస్త ఇబ్బందికి గురి చేసింది. అయితే ఆటను ప్రారంభించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సమయాన్ని గొప్పగా ఆస్వాదించాం. ఐపీఎల్‌కు ఎంతో స్టార్‌డమ్‌ ఉంది’’ అని రబాడ తెలిపాడు. కాగా, లీగ్‌ అనంతరం స్వదేశానికి చేరుకున్న రబాడ ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20ల సిరీస్‌కు క్వారంటైన్‌లో ఉంటూ సన్నద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని