రవీంద్ర జడేజాకు హ్యాట్సాఫ్‌: మంజ్రేకర్‌

గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ క్రికెటర్‌ అని సంబోధించి అందరి చేతా విమర్శలకు గురైన క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తాజాగా...

Published : 03 Dec 2020 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ క్రికెటర్‌ అని సంబోధించి అందరి చేతా విమర్శలకు గురైన క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తాజాగా అతడిని ‘హ్యాట్సాఫ్‌’ అని మెచ్చుకున్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జడేజా(66*).. పాండ్య(92*)తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి ఆస్ట్రేలియాకు 300పై చిలుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే కంగారూలు 289 పరుగులకు ఆలౌటై ఓటమిపాలయ్యారు. 

అయితే, అప్పట్లో జడేజాను విమర్శించాక మంజ్రేకర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు జడ్డూ సైతం దీటుగానే జవాబిచ్చాడు. ఆపై బీసీసీఐ మంజ్రేకర్‌ను వ్యాఖ్యాతగా తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో అతడికి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి జడ్డూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో మ్యాచ్‌ను గెలుపు ముంగిటి వరకు తీసుకెళ్లి మంజ్రేకర్‌ వ్యాఖ్యలకు సరైన జవాబిచ్చాడు. ఇక ఈ ఏడాది ఆడిన 9 వన్డే మ్యాచ్‌ల్లోనూ ఈ ఆల్‌రౌండర్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 223 పరుగులు చేసి 56.75 సగటు సాధించాడు. తాజా వన్డే సిరీస్‌లోనూ 25, 24, 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలోనే మంజ్రేకర్‌ అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. 

‘ఈ మ్యాచ్‌లో ఆఖరి 3-4 ఓవర్లు అతడు చాలా తెలివిగా ఆడాడు. జడ్డూ బంతిని కాచుకున్న విధానం ఎంతో నచ్చింది. ఆఫ్‌సైడ్‌, ఆన్‌సైడ్‌ తేడా లేకుండా పరుగులు చేశాడు. తన బ్యాటింగ్‌తో పాండ్య మీద ఒత్తిడిని తగ్గించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇదో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది. అతడు బ్యాట్‌తో రాణించడంతోనే టీమ్‌ఇండియా పోటీలో నిలబడింది. అయితే, జడ్డూ బౌలింగ్‌లో మరిన్ని వికెట్లు తీయాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పాను. బ్యాటింగ్‌లో మెరుగవుతున్నా బౌలింగ్‌లో మాత్రం శ్రమించాలి. ఇక ఈ ఆట విషయానికొస్తే అతడికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి’ అని మంజ్రేకర్‌ మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యానించాడు. ఇక పాండ్య, జడేజా భాగస్వామ్యంపై స్పందించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌మాక్స్‌వెల్‌.. వాళ్లిద్దరే తమ జట్టుకు విజయాన్ని దూరం చేశారన్నాడు. టీమ్‌ఇండియాను 152కే ఐదు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా తర్వాత వారిద్దరూ బాధ్యతగా ఆడారన్నాడు. హిట్టింగ్‌తో తమపై ఒత్తిడి పెంచి మంచి భాగస్వామ్యం నెలకొల్పారని మెచ్చుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని