టీమ్‌ఇండియా @ 2020 అంతంతే..! 

2020 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా జరిగిందేమీ లేదు. అన్ని రంగాల్లాగే క్రీడలు సైతం సుమారు 6 నెలలు నిలిచిపోయాయి...

Updated : 20 Dec 2020 14:44 IST

ఏడాదంతా ఎలా సాగిందంటే..

2020 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా జరిగిందేమీ లేదు. అన్ని రంగాల్లాగే క్రీడలు సైతం సుమారు 6 నెలలు నిలిచిపోయాయి. ఒలింపిక్స్‌వంటి మహా సంగ్రామమే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాక తగు జాగ్రత్తలతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్‌ కూడా ఈ ఏడాది అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. అలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఈ సంవత్సరం మొత్తం ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? ఎలా సాగింది? విజయాల శాతం ఎంత తదితర విషయాలు తెలుసుకుందాం.


శుభారంభం దక్కింది..

ఈ ఏడాది టీమ్‌ఇండియా మొత్తం ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 24. అందులో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 12 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో ఇంకో టెస్టు ఈనెల 26 నుంచి జరగాల్సి ఉంది. తొలుత జనవరిలో శ్రీలంకతో 3 టీ20ల సిరీస్‌ ఆడిన కోహ్లీసేన 2-0తో విజయం సాధించి 2020ని ఘనంగా ఆరంభించింది. ఆపై ఆస్ట్రేలియాతో తలపడిన మూడు వన్డేల సిరీస్‌లో 2-1 తేడాతో మరో కప్పు సాధించింది. దీంతో ఆదిలోనే శుభారంభం చేసి ఏడాదిపై ఆశలు రేకెత్తించింది.


ఉర్రూతలూగించి ఉసూరుమనిపించింది..

వరుసగా రెండు సిరీస్‌లు గెలుపొందిన ఉత్సాహంలో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియాకు అక్కడ మరో అద్భుత సిరీస్‌ సొంతమైంది. తొలుత ఆ జట్టును 5-0 తేడాతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. 3, 4 టీ20 మ్యాచ్‌లు స్కోర్లు సమం కాగా, భారత్‌ సూపర్‌ ఓవర్లలో గెలుపొందింది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్‌, 2 టెస్టుల సిరీస్‌లో చతికిల పడింది. ఈ ఐదింటిలో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా విజయం దక్కకుండా ఘోర పరాభవం చవిచూసింది. దీంతో కివీస్‌లో టీ20ల్లో అదరగొట్టిన కోహ్లీసేన తర్వాత ఘోరంగా విఫలమైంది.


అంతా అవాక్కయ్యేలా చేసింది..

ఇక కరోనా పరిస్థితుల కారణంగా చివరగా మార్చి 4న న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఆడిన భారత్‌ 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉన్నా అది వాయిదా పడింది. ఆపై లాక్‌డౌన్‌.. అనంతరం సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ జరిగాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌ నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. ఇక్కడ తొలుత 3 వన్డేల సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలవ్వగా తర్వాత 3 టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతోనే గెలుపొందింది. దీంతో వన్డే సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ క్రమంలోనే అడిలైడ్‌లో తొలి టెస్టు ఆడిన కోహ్లీసేన సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలోనే ఘోర పరాభవం ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌పై పట్టు బిగించేలా కనిపించినా శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 36కే కుప్పకూలి అభిమానులను నిరాశపర్చింది. 

* దీన్ని బట్టి చూస్తే భారత్‌ ఈ ఏడాది మొత్తం మిశ్రమ ఫలితాలు సాధించిందని చెప్పొచ్చు. అయితే, ఆటలో గెలుపోటములు సహజమే అయినా, ఏడాది చివర్లో టీమ్‌ఇండియా మరీ ఇంత ఘోరంగా విఫలమవ్వడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాడు రోహిత్‌ శర్మ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌, ఆపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ మాత్రమే ఆడాడు. అంతకుముందు శ్రీలంకతో టీ20 సిరీస్‌, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఏ మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో అతడు లేని లోటు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..

ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయండి: కైఫ్‌

36.. పరువు కంగారు పాలు

98444421000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని