IND vs ENG: గిల్‌.. ఇప్పటినుంచి బ్యాట్‌తోనే మాట్లాడు: యువరాజ్‌ సింగ్‌

విమర్శల నేపథ్యంలో విశాఖ టెస్టులో సెంచరీ సాధించి భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన శుభ్‌మన్‌ గిల్‌ను మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసించాడు. 

Updated : 06 Feb 2024 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో టెస్టులో సెంచరీ సాధించి టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను భారత మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ప్రశంసించాడు. ఈ మేరకు తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై యువరాజ్‌ స్పందిస్తూ ‘‘కీలక దశలో మంచి ఇన్నింగ్స్‌ ఆడావు. మూడంకెల స్కోరు సాధించడం అభినందనీయం. ఇకనుంచి బ్యాట్‌తోనే మాట్లాడు’’ అని తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నాడు. 

గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన సాగిస్తూ గిల్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) సైతం అతడిని హెచ్చరించాడు. ‘‘ఇది యువకులు తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం. పుజారా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని మర్చిపోవద్దు. అతడు రంజీ ట్రోఫీలో సత్తా చాటుతూ నిరంతరం అందుబాటులో ఉంటున్నాడు’’ అని పేర్కొన్నాడు. అనంతరం విశాఖ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

మ్యాచ్‌ అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ ‘‘మూడో స్థానంలో పరుగులు చేయడం చాలా ముఖ్యమైంది.ఆ స్థానంలో శతకం సాధించడం సంతోషంగా ఉంది. శుభారంభాన్నిచ్చే ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ వికెట్లు త్వరగా కోల్పోయిన సమయంలో ఇది కీలకమైనది. దీంతో మేము ఆధిక్యం సాధించడానికి వీలైనన్ని పరుగులు  చేయాలనుకున్నా. మనం బాగా ఆడితే ప్రశంసిస్తారు. లేకపోతే వేరే విధంగా మాట్లాడుతారు. ఇదంతా ఆటలో ఒక భాగమే. పరిస్థితికి తగ్గట్టుగా ఎలా బ్యాటింగ్‌ చేయాలనేదే ముఖ్యం. నేనూ అలా ఆడాలనే ప్రయత్నిస్తా’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని