IND vs AFG: క్రీడా స్ఫూర్తి.. మళ్లీ నన్ను క్షమించండి: రవిచంద్రన్ అశ్విన్

ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ, క్రీడా స్ఫూర్తితో ఆడితే గౌరవం మరోలా ఉంటుంది. సరైన ఆట ప్రదర్శించకపోతే విమర్శలు ఎదుర్కోవడమూ సహజమే. భారత్ - అఫ్గాన్‌ మూడో టీ20 (IND vs AFG) సందర్భంగానూ మరోసారి క్రీడాస్ఫూర్తి చర్చకొచ్చింది.

Published : 19 Jan 2024 20:37 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్‌ మూడో టీ20లో (IND vs AFG) సూపర్‌ ఓవర్లు మాత్రమే కాకుండా.. ఇరు జట్ల సీనియర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఫ్గాన్‌ ఆటగాడు మహమ్మద్‌ నబీ పరుగు తీస్తున్న క్రమంలో బంతి అతడి ప్యాడ్లను తాకి దూరంగా వెళ్లింది. దీంతో అదనంగా ఆ జట్టు రెండు పరుగులను రాబట్టుకుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. నబీతో రోహిత్ చర్చించిన వీడియోలు వైరల్‌గా మారాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అఫ్గాన్‌ బ్యాటర్ వ్యవహరించాడని భారత అభిమానులు కామెంట్లు చేశారు. మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా టీమ్‌ఇండియా వైఖరి సరైంది కాదని ఆక్షేపించాడు. క్రీడాస్ఫూర్తి అనే పదం వినపడగానే అందరి మదిలో మెదిలే రవిచంద్రన్ అశ్విన్‌ కూడా దీనిపై స్పందించాడు. 

‘‘ప్రతి కథకూ రెండు పార్శాలుంటాయి. ఫీల్డ్‌లో మనం ప్రభావితమైతే అసహనం రావడం సహజమే. అక్కడ మేం ఉంటే ఇలా చేయం అని చెబుతాం. ఏదేమైనా అది మన వ్యక్తిగత అభిప్రాయం. భారత క్రికెట్ అభిమానిగా చెబుతున్నా.. వచ్చే వరల్డ్‌ కప్‌ నాకౌట్‌లో సూపర్‌ ఓవర్‌ను మనం ఎదుర్కోవాల్సి వచ్చిందనుకుందాం.. కేవలం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాలి. వికెట్‌ కీపర్‌ మన ప్యాడ్లను తాకేలా విసిరాడనుకుందాం.. అప్పుడు మనం పరుగు తీయకుండా ఉంటామా? బ్యాటర్‌గా మనం రన్‌ చేయకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మూడో టీ20లోనూ ఇదే విధమైన చర్చ జరుగుతోంది’’

‘‘ఇప్పటివరకు జరిగిన దీనిపై వివరణ ఇద్దామని వచ్చా. బౌలర్ వికెట్‌ తీయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాడు. బ్యాటర్ పరుగుల కోసం ఆడతాడు. బంతి ప్యాడ్లను తాకితే అది లెగ్‌బై. ఒకవేళ బ్యాట్‌ను, శరీరాన్ని తాకకుండా బంతి కీపర్‌ వద్దకు వెళ్లినప్పుడు పరుగు తీస్తే అది బై. క్రీజ్‌కు దూరంగా వెళ్తే వైడ్. బాల్‌ వేసేటప్పుడు బౌలర్‌ కాలు క్రీజ్‌ను దాటినా, బ్యాటర్‌ నడుము ఎత్తుపై వస్తే నో బాల్‌ అవుతుంది. ఎలా వేసినా బౌలర్ వికెట్‌ తీయడం కోసమే చేస్తాడు. పరుగు ఇవ్వకుండా ఉండాలనే ప్రయత్నిస్తాడు. దీని ప్రకారం.. ఫీల్డర్‌ కూడా బంతిని విసిరి బ్యాటర్‌ను రనౌట్‌ చేద్దామని చూస్తాడు. రనౌట్‌ చేయడానికి పరుగెత్తే క్రమంలో.. ఆ త్రో పక్క నుంచి వెళ్లింది. అప్పుడు ఆ బ్యాటర్‌కు రన్‌ తీసే హక్కు ఉంది. ఇక క్రీడాస్ఫూర్తి అంటారా.. మళ్లీ నన్ను క్షమించండి’’ అని అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని