Asia Championship: ఆసియా ఛాంపియన్‌షిప్.. భారత్‌కు కాంస్య పతకం

ఆసియా ఛాంపియన్‌షిప్-2021 ట్రోఫీలో భారత్‌కు కాంస్య పతకం...

Updated : 22 Dec 2021 20:17 IST

ఉత్కంఠపోరులో పాక్‌పై టీమ్‌ఇండియా విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా ఛాంపియన్‌షిప్-2021 ట్రోఫీలో భారత్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 4-3 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. భారత ఆటగాళ్లు హర్మన్ ప్రీత్‌ సింగ్, సుమిత్, వరుణ్ కుమార్‌, అకాశ్‌ దీప్‌ సింగ్ గోల్స్‌ను సాధించగా.. పాక్‌ తరఫున నదీమ్‌, అర్ఫ్రాజ్‌, అబ్దుల్‌ రానా గోల్స్ కొట్టారు. సెమీస్‌లో జపాన్‌ చేతిలో టీమ్ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో కాంస్యం కోసం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి నుంచి భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చినా ఒకదానినే గోల్‌గా మలిచారు. తొలి క్వార్టర్‌ ముగిసే సరికి భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

అయితే వెంటనే పుంజుకున్న పాకిస్థాన్‌ పదకొండో నిమిషంలో (అర్ఫ్రాజ్) గోల్‌ చేసి స్కోరును 1-1 సమం చేసింది. మూడో క్వార్టర్‌ (33వ నిమిషం) ప్రారంభంలోనే పాక్‌ ప్లేయర్ అబ్దుల్‌ గోల్‌ కొట్టడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 45వ నిమిషం వద్ద సుమిత్ గోల్‌తో మళ్లీ స్కోరు (2-2) సమమైంది. వరుణ్‌ కుమార్‌ (53వ నిమిషం), ఆకాశ్‌ దీప్ (57వ నిమిషం) వరుసగా గోల్స్‌ సాధించడంతో భారత్ 4-2తో విజయం వైపు దూసుకెళ్లింది. అయితే ఆఖర్లో పాక్‌  గోల్స్ చేసినా ఆధిక్యం తగ్గించగలిగిందే కానీ.. విజయం సాధించలేకపోయింది. దీంతో చివరికి భారత్‌ 4-3 తేడాతో సూపర్‌ విక్టరీని నమోదు చేసి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని