తొలి రోజు ఆస్ట్రేలియా 274/5 

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌(108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా...

Published : 16 Jan 2021 00:42 IST

శతకంతో మెరిసిన లబుషేన్‌

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌(108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా, మాథ్యూవేడ్‌(45; 87 బంతుల్లో 6x4) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలిరోజు ఆసీస్‌దే పై చేయిగా నిలిచింది. భారత బౌలర్లలో నటరాజన్‌ 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇక ఆట ముగిసే సమయానికి కామెరాన్‌ గ్రీన్‌(28*; 70 బంతుల్లో 3x4), కెప్టెన్‌ టిమ్‌పైన్‌(38*; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు.  

భారత్‌కు శుభారంభం..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(1) తొలి ఓవర్‌లోనే సిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ చేతికి చిక్కాడు. 4 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియాకు కాసేపటికే శార్దూల్‌ ఠాకుర్‌ మరో షాకిచ్చాడు. ఇంకో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌(5)ను ఔట్‌ చేశాడు. అతడు వాషింగ్టన్‌ సుందర్‌ చేతికి చిక్కడంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై జోడీ కట్టిన స్మిత్‌(36; 77 బంతుల్లో 5x4), లబుషేన్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌ 65/2గా నమోదైంది. ఈ క్రమంలోనే భోజన విరామం తర్వాత మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించాక స్మిత్‌ ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు చిక్కడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది.

వేడ్‌, లబుషేన్‌ శతక భాగస్వామ్యం..

ఆపై లబుషేన్‌, వేడ్‌ మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న ఈ జోడీని నటరాజన్‌ విడదీశాడు. స్వల్ప వ్యవధిలో వారిద్దరినీ ఔట్‌ చేశాడు. తొలుత జట్టు స్కోర్‌ 200 వద్ద వేడ్‌ను పెవిలియన్‌ పంపిన అతడు కాసేపటికే లబుషేన్‌ను బోల్తాకొట్టించాడు. దీంతో ఆసీస్‌ 213 పరగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం గ్రీన్‌, పైన్‌ మరో వికెట్‌ పడకుండా ఆడారు. వీరిద్దరూ 128 బంతులాడి 61 పరుగులు చేశారు. చివరికి మూడు ఓవర్లు ఉండగానే ఆటను నిలిపివేశారు. తొలి రోజు 87 ఓవర్లకు ఆసీస్‌ 274/5తో నిలిచింది. 

 ఇవీ చదవండి..

కుల్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం 

 

60 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా 20 ఆటగాళ్లతో.. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని