Rishabh Pant: ఐపీఎల్‌-2024లో పంత్ ఆడతాడా? లేదా? దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి అప్‌డేట్‌ ఇదే!

మార్చి చివరి నుంచి ఐపీఎల్‌ 2024 (IPL 2024) సందడి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, భారత స్టార్‌ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ ఆడతాడా? లేదా? అనే సందిగ్ధత దిల్లీ అభిమానుల్లో కొనసాగుతోంది.

Updated : 20 Jan 2024 12:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న భారత స్టార్‌ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2024) ఆడతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐఎల్‌టీ20 లీగ్‌లో దిల్లీ ఫ్రాంచైజీ కూడా ఆడుతున్న విషయం తెలిసిందే. దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టుకు డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) చెందిన ఉన్నతస్థాయి అధికారి సాగర్‌ స్పష్టత ఇచ్చారు.

‘‘తప్పకుండా రిషభ్‌ పంత్ వచ్చే సీజన్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. టాప్‌ ప్లేయర్‌ జట్టుతో ఉంటే మాకెంతో ప్రయోజనం. మా కోచ్‌లు, ఫిజియో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పంత్ కూడా వేగంగా కోలుకుంటున్నాడు. మార్చి నాటికి అతడు ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నాం. ఇటీవల ఐపీఎల్ వేలం సందర్భంగా పంత్‌ దుబాయ్‌ వచ్చాడు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. హ్యారీ బ్రూక్, జే రిచర్డ్‌సన్, షైహోప్‌ వంటి ప్లేయర్లను దక్కించుకున్నాం. దేశవాళీ క్రికెటర్ కుషాంగ్రాను కూడా తీసుకున్నాం. మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఐఎల్‌టీ20లోనూ మా జట్టు ఆడనుండటం ఆనందంగా ఉంది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో అద్భుత ఫలితాలను సాధిస్తామని భావిస్తున్నాం’’ అని సాగర్‌ అన్నారు. 

మరో ఐదేళ్లు టాటానే స్పాన్సర్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) స్పాన్సర్‌షిప్‌ హక్కులను మరో ఐదేళ్లపాటు టాటా గ్రూప్‌కే దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోనే ఉన్న హక్కులు 2028 వరకు కొనసాగుతాయని సమాచారం. 2022-23లో రెండేళ్ల కాలవ్యవధికి వివో నుంచి ఐపీఎల్ హక్కులను టాటా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్ల కాలానికి ఎంత విలువతో హక్కులను టాటా దక్కించుకుందో తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇటు ఐపీఎల్‌ వర్గాలు, అటు టాటా గ్రూప్‌ అధికారికంగా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని