Dwayne Bravo: లఖ్‌నవూతో మ్యాచ్‌లో బ్రావో సరికొత్త రికార్డు..

చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెగా టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు (171) తీసిన బౌలర్‌గా ఎదిగాడు. ఇదివరకు లసిత్‌ మలింగ (170) పేరిట ఉన్న ఆ రికార్డును బ్రావో తాజాగా అధిగమించాడు...

Published : 01 Apr 2022 11:37 IST

(Photo: Dwayne Bravo Instagram)

ముంబయి: చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెగా టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు (171) తీసిన బౌలర్‌గా ఎదిగాడు. ఇదివరకు లసిత్‌ మలింగ (170) పేరిట ఉన్న ఆ రికార్డును బ్రావో తాజాగా అధిగమించాడు. దీంతో ఈ లీగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు బ్రావో.. మలింగతో సమానంగా వికెట్లు తీశాడు. ఇక గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో అతడు దీపక్‌ హుడా (13; 8 బంతుల్లో 1x4, 1x6)ను ఔట్‌ చేయడం ద్వారా కొత్త రికార్డు నమోదు చేశాడు. మలింగ మొత్తం 122 మ్యాచ్‌లో 19.80 సగటుతో 170 వికెట్లు పడగొట్టగా.. బ్రావో 153 మ్యాచ్‌ల్లో 24.06 సగటుతో 171 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో అమిత్‌ మిశ్రా (166), పీయుష్‌ చావ్లా (157), హర్భజన్‌సింగ్‌ (150) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

(Photo: Dhoni Instagram)

మరోవైపు ఇదే మ్యాచ్‌లో చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో మేటి రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో అతడు 7 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, రాబిన్‌ ఉతప్ప ముందున్నారు. మహీ ఈ ఘనత సాధించడానికి లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు 15 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే, అతడు 6 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 16 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు మొత్తంగా పొట్టి క్రికెట్‌లో 7,001 పరుగులు చేశాడు. అందులో 28 అర్ధ శతకాలుండటం గమనార్హం. అలాగే ఇదే మ్యాచ్‌లో ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో ధోనీ.. డికాక్‌ (61; 45 బంతుల్లో 9x4) క్యాచ్‌ను అందుకోవడంతో టీ20ల్లో 200 క్యాచ్‌లు కూడా పూర్తి చేసుకోవడం విశేషం. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని