Faf duplessis: గాల్లో తేలినట్టుంది.. ఈరోజు ఎంతో ప్రత్యేకం: డుప్లెసిస్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ క్వాలిఫయర్‌-2కు వెళ్లినందుకు ఆ జట్టు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ గాల్లో తేలుతున్నాడు...

Published : 26 May 2022 09:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ క్వాలిఫయర్‌-2కు వెళ్లినందుకు ఆ జట్టు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ హర్షం వ్యక్తం చేశాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన కీలకమైన ఎలిమినేటర్‌-1 మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో శుక్రవారం రాత్రి ఆ జట్టు రాజస్థాన్‌తో మరో కీలక పోరులో తలపడనుంది. ఈ విజయంపై స్పందించిన డుప్లెసిస్‌ ఈ రోజు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.

‘మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ విజయంతో గాల్లో తేలినట్టుంది. రజత్‌ పటీదార్‌ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12x4, 7x6) లాంటి యువ ఆటగాడు ఇలా రాణించడం జట్టుకు శుభపరిణామం. అతడు శతకం సెలబ్రేట్‌ చేసుకున్న విధానం చూస్తే ఎలాంటి బాధ్యత తన భుజాలపై మోసాడో అర్థమవుతుంది. ఈ టోర్నీల్లో నేను చూసిన అతి గొప్ప శతకాల్లో ఇదొకటి. స్టేడియం నలువైపులా షాట్లు కొట్టాడు. అతడు దూకుడుగా ఆడిన ప్రతిసారీ ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తాడు. రెండో ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వారికి ఎలా బౌలింగ్‌ చేయలనే విషయంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. దీన్ని మేం దీన్ని పెద్ద మ్యాచ్‌లా భావించలేదు. హర్షల్‌ మా జట్టులో ప్రత్యేకమైన బౌలర్‌. అతడు డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థులను దెబ్బతీశాడు. అతడు వేసిన 18వ ఓవర్‌లోనే ఈ మ్యాచ్‌ మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద విజయం సాధించినా ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం’ అని డుప్లెసిస్‌ వివరించాడు.

మా ఓటమికి అదే కారణం: రాహుల్‌

ఇక ఈ ఓటమితో 15వ సీజన్‌ నుంచి నిష్క్రమించిన లఖ్‌నవూ వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని అంటోంది. ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ తమ ఓటమికి ప్రధాన కారణం క్యాచ్‌లు వదిలేయడమేనని చెప్పాడు. ‘ఫీల్డింగ్‌ లోపాల వల్లే మేం ఈ మ్యాచ్‌ ఓడిపోయాం. తేలికైన క్యాచ్‌లు కూడా వదిలేయడం మంచిది కాదు. మరోవైపు పటీదార్‌ అద్భుతంగా ఆడాడు. టాప్‌-3లో ఎవరైనా సెంచరీ కొడితే ఆ జట్టు చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే బెంగళూరు మాకన్నా గొప్పగా ఫీల్డింగ్‌ చేసింది. ఆ విషయంలో మేం తేలిపోయాం. ఇక్కడి నుంచి నిష్క్రమించినా.. ఈ టోర్నీలోని సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. మాది కొత్త ఫ్రాంఛైజీ. అయినా, పలు తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. ప్రతి జట్టుకు ఇలాంటివి సహజమే. వాటి నుంచి నేర్చుకొని తిరిగి బలంగా వస్తాం. మా బౌలింగ్‌లో మోసిన్‌ ఖాన్‌ ఎంత నైపుణ్యం ఉన్న ఆటగాడో ఈ సీజన్‌లో తెలిసొచ్చింది. అతడు మ్యాచ్‌లు ఆడేకొద్దీ రాటుదేలుతాడు. వచ్చే సీజన్‌కు మరింత మెరుగవుతాడని ఆశిస్తున్నా’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు