సంక్షిప్త వార్తలు (3)

మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ కోనేరు హంపి తొలి విజయం సాధించింది. నాలుగో రౌండ్లో ఓడిన ఈ తెలుగమ్మాయి..

Published : 31 Mar 2023 01:25 IST

హంపి విజయం
హారిక ఓటమి

దిల్లీ: మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ కోనేరు హంపి తొలి విజయం సాధించింది. నాలుగో రౌండ్లో ఓడిన ఈ తెలుగమ్మాయి.. గురువారం అయిదో రౌండ్లో ననా జాగ్నిజ్‌ (జార్జియా)ను 59 ఎత్తుల్లో ఓడించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. అసుబయెవా (కజకిస్థాన్‌) 62 ఎత్తుల్లో హారికపై నెగ్గింది. గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి.. నినో బసిష్వెలి (జార్జియా)తో పాయింట్లు పంచుకుంది. అయిదు రౌండ్లలో 2.5 పాయింట్లతో హంపి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. హారిక (1.5) ఏడు.. వైశాలి (0.5) పదో స్థానంలో ఉన్నారు. జినెర్‌ జుహు (3.5, చైనా) అగ్రస్థానంలో ఉంది.


క్లిష్టమైన గ్రూప్‌లో భారత్‌

అండర్‌-17 ఆసియన్‌కప్‌ ఫుట్‌బాల్‌

దిల్లీ: ఏఎఫ్‌సీ అండర్‌-17 ఆసియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో భారత్‌ క్లిష్టమైన గ్రూప్‌లో పడింది. జూన్‌ 15న థాయ్‌లాండ్‌లో ఆరంభమయ్యే ఈ టోర్నీ డ్రాను గురువారం ప్రకటించారు. 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి ఆడుతున్న ఈ పోటీల్లో గ్రూప్‌-డిలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌, వియత్నాం, ఉజ్బెకిస్థాన్‌తో కలిసి భారత్‌ పోటీపడనుంది. గ్రూప్‌-ఎలో థాయ్‌లాండ్‌, యెమన్‌, మలేసియా, లావోస్‌.. గ్రూప్‌-బిలో కొరియా, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, ఖతార్‌.. గ్రూప్‌-సిలో తజకిస్థాన్‌, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, చైనా ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌ చేరే నాలుగు జట్లు పెరూలో జరిగే 2023 అండర్‌-17 ప్రపంచకప్‌ బెర్తు దక్కించుకుంటాయి. ఆసియన్‌ కప్‌లో ఇప్పటిదాకా ఉత్తమంగా రెండు పర్యాయాలు క్వార్టర్‌ఫైనల్‌ చేరిన భారత్‌కు ఈ టోర్నీలో ఆడడం ఇది పన్నెండోసారి.


రాజస్థాన్‌లో రెండో అతిపెద్ద స్టేడియం

జైపుర్‌: రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘం (ఆర్‌సీఏ) దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మించనుంది. జైపుర్‌ జిల్లాలోని చోన్ప్‌ గ్రామంలో ఈ స్టేడియం నిర్మించేందుకు హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌)తో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. వేదాంత గ్రూపునకు చెందిన హెచ్‌జెడ్‌ఎల్‌ రూ.300 కోట్లతో స్టేడియాన్ని నిర్మించనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో 75,000 సీట్ల సామర్థ్యంతో స్టేడియం రూపుదిద్దుకోనుంది. దేశంలో నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్‌) తర్వాత ఇదే అతిపెద్ద క్రికెట్‌ మైదానం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు