ఊపేసిన ఉత్సాహం..

మనసులను మైమరిపించిన పాటలతో.. తనువును ఊపేసిన నృత్యాలతో.. రంగురంగుల దీపాల కాంతుల్లో.. బాణాసంచా వెలుగుల్లో.. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఘనంగా ఆరంభమైంది.

Published : 01 Apr 2023 04:36 IST

అహ్మదాబాద్‌: మనసులను మైమరిపించిన పాటలతో.. తనువును ఊపేసిన నృత్యాలతో.. రంగురంగుల దీపాల కాంతుల్లో.. బాణాసంచా వెలుగుల్లో.. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఘనంగా ఆరంభమైంది. కరోనా కారణంగా 2019 తర్వాత ఐపీఎల్‌ సీజన్ల ఆరంభ వేడుకలు జరగని సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో సంబరాలు హోరెత్తాయి. ముందుగా ప్రముఖ గాయకుడు అర్జిత్‌ సింగ్‌.. తన గానంతో ప్రేక్షకుల హృదయాలు దోచేశాడు. ప్రజాదరణ పొందిన హిందీ పాటలతో స్టేడియాన్ని హుషారెత్తించాడు. గోల్ఫ్‌ కారులో మైదానంలో తిరుగుతూ పాటలు పాడాడు. ఆ తర్వాత నటీమణులు తమన్నా భాటియా, రష్మిక మంధాన స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలోని పాటలకు అడుగులు కలిపారు. మొదట తమన్నా.. దక్షిణాదితో పాటు హిందీ సినిమాల పాటలకు నృత్య ప్రదర్శన ఇచ్చింది. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా’ అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసింది. అనంతరం ‘పుష్ప’లోని ‘సామి’, ‘శ్రీవల్లి’ హిందీ పాటకు, ఇటీవల ఆస్కార్‌ పురస్కారం పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు రష్మిక ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. చివరగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని, గుజరాత్‌ జెయింట్స్‌ సారథి హార్దిక్‌ పాండ్య.. ఐపీఎల్‌ ట్రోఫీని ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని