PBKS vs GT: శుభ్‌మన్‌ మెరిసె.. టైటాన్స్‌ మురిసె

ధనాధన్‌ దంచుడు లేదు.. బౌండరీల మోతా లేదు. తక్కువ స్కోర్లే. కానీ ఈ ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌కు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌. పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ హోరాహోరీ సమరం అభిమానులను మురిపించింది. పంజాబ్‌ కష్టంగా 153 చేస్తే.. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి టైటాన్స్‌ చెమటోడ్చింది.

Updated : 14 Apr 2023 07:46 IST

పంజాబ్‌ పరాజయం
రాణించిన మోహిత్‌
మొహాలి

ధనాధన్‌ దంచుడు లేదు.. బౌండరీల మోతా లేదు. తక్కువ స్కోర్లే. కానీ ఈ ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌కు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌. పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ హోరాహోరీ సమరం అభిమానులను మురిపించింది. పంజాబ్‌ కష్టంగా 153 చేస్తే.. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి టైటాన్స్‌ చెమటోడ్చింది. శుభ్‌మన్‌.. టైటాన్స్‌ హీరో.

గుజరాత్‌ టైటాన్స్‌ ఉత్కంఠలో నిలిచింది. గురువారం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 6  వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట పంజాబ్‌ 8 వికెట్లకు 153 పరుగులే చేయగలిగింది. మాథ్యూ షార్ట్‌ (36; 24 బంతుల్లో 6×4, 1×6) టాప్‌ స్కోరర్‌. మోహిత్‌ శర్మ (2/18), రషీద్‌ ఖాన్‌ (1/26), అల్జారి జోసెఫ్‌ (1/32), జోష్‌ లిటిల్‌ (1/31) పంజాబ్‌కు కళ్లెం వేశారు. ఛేదనలో గుజరాత్‌కు కష్టపడక తప్పలేదు. శుభ్‌మన్‌ గిల్‌(67; 49 బంతుల్లో 7×4, 1×6) ఇన్నింగ్స్‌ వెన్నెముకగా నిలవడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌ తెవాతియా (5 నాటౌట్‌) ఆఖర్లో ఒత్తిడిలో చక్కని షాట్‌ ఆడి పని పూర్తి చేశాడు.

శుభ్‌మన్‌ సూపర్‌: ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ ఆటే హైలైట్‌. పంజాబ్‌ బౌలర్లూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా, ఒత్తిడి తెచ్చినా ఓ వైపు గిల్‌ నిలవడంతో టైటాన్స్‌ పైచేయి సాధించింది. పెద్దదేమీ కాని లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆరంభం అదిరిపోయింది. ఓపెనర్లు సాహా (30), గిల్‌ బ్యాట్లు ఝుళిపించడంతో నాలుగు ఓవర్లలోనే ఆ జట్టు 44 పరుగులు చేసింది. అర్ష్‌దీప్‌ ఓవర్లో సాహా ఏకంగా నాలుగు బౌండరీలు సాధించాడు. గిల్‌ కూడా ముచ్చటైన షాట్లు ఆడాడు. అయితే ఆ తర్వాత పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. పరుగులు వేగంగా రాలేదు. ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో సాహాను ఔట్‌ చేసిన రబాడ పంజాబ్‌కు తొలి వికెట్‌ను అందించాడు. 5 నుంచి 10 ఓవర్ల మధ్య టైటాన్స్‌కు 36 పరుగులే వచ్చాయి. అయినా సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువ లేకపోవడం, కుదురుగా బ్యాటింగ్‌ చేస్తున్న గిల్‌తో పాటు ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌ (19; 20 బంతుల్లో 2×4) క్రీజులో ఉండడంతో ఆ జట్టుకు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది.. 12వ ఓవర్లో సుదర్శన్‌ ఔట్‌ కావడంతో 41 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే బౌండరీలకు కళ్లెం వేయగలిగిన పంజాబ్‌ 15వ ఓవర్లో హార్దిక్‌ (8)ను కూడా ఔట్‌ చేసి టైటాన్స్‌పై ఒత్తిడి తేగలిగింది.

ఆఖర్లో ఉత్కంఠ..: పరుగులు స్వేచ్ఛగా రాకపోవడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది కూడా. టైటాన్స్‌ విజయం అనుకున్నంత తేలిక కాదని అర్థమైన దశ అది. చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు 43 పరుగులు చేయాల్సిన పరిస్థితి. విధ్వంసకారుడు మిల్లర్‌ (17 నాటౌట్‌)కు కూడా ధాటిగా ఆడడం సాధ్యం కాలేదు. సమీకరణం చివరి మూడు ఓవర్లలో 25కు మారింది. అయితే రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో గిల్‌ ఓ కళ్లు చెదిరే సిక్స్‌, మిల్లర్‌ ఓ ఫోర్‌ కొట్టడంతో టైటాన్స్‌పై ఒత్తిడి తగ్గింది. కానీ 19వ ఓవర్లో ఆరు పరుగులే ఇచ్చిన అర్ష్‌దీప్‌ మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు. బౌండరీలు తేలిగ్గా వచ్చే పరిస్థితి లేకపోవడంతో టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. పైగా చివరి ఓవర్లో ఆ జట్టు ఏడు పరుగులే చేయాల్సివుండగా తొలి బంతికి సింగిల్‌ ఇచ్చిన కరన్‌.. తర్వాతి బంతికి గిల్‌ను బౌల్డ్‌ చేశాడు. తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి. తీవ్ర ఒత్తిడిలో అయిదో బంతిని స్కూప్‌ షాట్‌తో తెవాతియా ఫైన్‌లెగ్‌ బౌండరీకి తరలించడంతో విజయం గుజరాత్‌ సొంతమైంది.

పంజాబ్‌ కట్టడి: అంతకుముందు పంజాబ్‌కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 4 ఓవర్లలో 30 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ప్రభ్‌సిమ్రన్‌ను షమి ఔట్‌ చేయగా.. నాలుగో ఓవర్లో ధావన్‌ను లిటిల్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలబడ్డారు. కానీ పరుగులే అవసరమైనంత వేగంగా రాలేదు. రషీద్‌, మోహిత్‌ శర్మ, జోసెఫ్‌ ఇలా.. బౌలర్లెవరూ బ్యాటర్లకు స్వేచ్ఛనివ్వలేదు. షమి ఒక్కడే ఎక్కువ పరుగులిచ్చాడు. పంజాబ్‌ బ్యాటర్లలో ఉన్నంతలో షార్ట్‌ మెరుగు. కొన్ని చక్కని షాట్లు ఆడిన అతడు.. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 55 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత భానుక రాజపక్స (20; 26 బంతుల్లో 1×4), జితేశ్‌ శర్మ (25; 23 బంతుల్లో 5×4) 37 పరుగులు జోడించారు. కానీ అందుకోసం 34 బంతులు ఆడారు. 14వ ఓవర్లో జితేశ్‌ను మోహిత్‌ ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 92 పరుగులే. సామ్‌ కరన్‌ (22; 22 బంతుల్లో 1×4, 1×6) కూడా అంతే. పెద్దగా మెరిసింది లేదు. 14, 15 ఓవర్లలో కలిపి పంజాబ్‌కు కేవలం అయిదు పరుగులే వచ్చాయి. అయితే ఆ తర్వాత రషీద్‌ బౌలింగ్‌లో కరన్‌ ఓ సిక్స్‌ దంచాడు. రాజపక్స నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన షారుక్‌ ఖాన్‌ (22; 9 బంతుల్లో 1×4, 2×6) కాసేపు బ్యాట్‌ ఝుళిపించడంతో పంజాబ్‌ 150 దాటగలిగింది. అతడి దూకుడుతో చివరి మూడు ఓవర్లలో ఆ జట్టు 32 పరుగులు రాబట్టింది. షారుక్‌ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్లో కరన్‌ నిష్క్రమించాడు.


100

ఐపీఎల్‌లో రబాడ వికెట్లు. అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. 64 మ్యాచ్‌ల్లో అతను 100 వికెట్లు పడగొట్టాడు. మలింగ (70 మ్యాచ్‌ల్లో), హర్షల్‌ పటేల్‌ (81), భువనేశ్వర్‌ (82), రషీద్‌ ఖాన్‌ (83), అమిత్‌ మిశ్రా (83),  నెహ్రా (83) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


మోహిత్‌ కొత్తగా..

మోహిత్‌శర్మ ఐపీఎల్‌లో ఓ వెలుగు వెలిగిన పేసర్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యధిక వికెట్ల వీరుడికి ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ (2014) కూడా సొంతం చేసుకున్నాడతను. కానీ ఫామ్‌, ఫిట్‌నెస్‌ కోల్పోయి ఐపీఎల్‌కే దూరమయ్యాడు. చివరిగా 2020లో దిల్లీకి ఆడిన తర్వాత మళ్లీ కనబడలేదు. నిరుడు గుజరాత్‌ టైటాన్స్‌కు నెట్‌ బౌలర్‌గా సేవలందించిన ఈ పేసర్‌.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. గతంలో కంటే ఫిట్‌గా మారి కొత్త లుక్‌తో వచ్చిన మోహిత్‌ పునరాగమనంలో తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాదు ఓ రెండు వికెట్లు కూడా ఖాతాలో వేసుకుని గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒకప్పుడు రూ.6.5 కోట్లు పలికిన ఈ పేసర్‌ను మినీ వేలంలో గుజరాత్‌ రూ.50 లక్షలకే దక్కించుకుంది.


పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) షమి 0; ధావన్‌ (సి) జోసెఫ్‌ (బి) లిటిల్‌ 8; షార్ట్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 36; రాజపక్స (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 20; జితేశ్‌ (సి) సాహా (బి) మోహిత్‌ 25; సామ్‌ కరన్‌ (సి) గిల్‌ (బి) మోహిత్‌ 22; షారుక్‌ రనౌట్‌ 22; బ్రార్‌ నాటౌట్‌ 8; రిషి రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153;

వికెట్ల పతనం: 1-0, 2-28, 3-55, 4-92, 5-115, 6-136, 7-152, 8-153; బౌలింగ్‌: షమి 4-0-44-1; లిటిల్‌ 4-0-31-1; జోసెఫ్‌ 4-0-32-1; రషీద్‌ 4-0-26-1; మోహిత్‌ 4-0-18-2

గుజరాత్‌: సాహా (సి) షార్ట్‌ (బి) రబాడ 30; శుభ్‌మన్‌ (బి) కరన్‌ 67; సాయి సుదర్శన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్ష్‌దీప్‌ 19; హార్దిక్‌ పాండ్య (సి) కరన్‌ (బి) హర్‌ప్రీత్‌ 8; మిల్లర్‌ నాటౌట్‌ 17; తెవాతియా నాటౌట్‌ 5 ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 154;

వికెట్ల పతనం: 1-48, 2-89, 3-106, 4-148; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-33-1; రబాడ 4-0-36-1; బ్రార్‌ 4-0-20-1; సామ్‌ కరన్‌ 3.5-0-25-1; ఆర్‌.చాహర్‌ 3-0-24-0; షార్ట్‌ 1-0-8-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు