MI vs KKR: వెంకీ వంద కొట్టినా.. గెలుపు ముంబయిదే

ఈ సీజన్లో ఆటేమీ బాగోలేదు.. గత మ్యాచ్‌లో చాలా కష్టపడి గెలిచి బోణీ కొట్టింది. ఎదురుగా బలమైన కోల్‌కతా.. పైగా 180కిపైగా లక్ష్యం! కానీ ముంబయి బెదరలేదు.. అదిరే ఆటతో కేకేఆర్‌కు ఝలక్‌ ఇచ్చింది. పిడుగులా పడిన ఇషాన్‌.. ఫామ్‌ అందుకున్న సూర్య కోల్‌కతాకు చేదు అనుభవాన్ని మిగిల్చారు.

Updated : 17 Apr 2023 07:45 IST

చెలరేగిన ఇషాన్‌, సూర్య
కోల్‌కతాకు తప్పని ఓటమి
ముంబయి

ఈ సీజన్లో ఆటేమీ బాగోలేదు.. గత మ్యాచ్‌లో చాలా కష్టపడి గెలిచి బోణీ కొట్టింది. ఎదురుగా బలమైన కోల్‌కతా.. పైగా 180కిపైగా లక్ష్యం! కానీ ముంబయి బెదరలేదు.. అదిరే ఆటతో కేకేఆర్‌కు ఝలక్‌ ఇచ్చింది. పిడుగులా పడిన ఇషాన్‌.. ఫామ్‌ అందుకున్న సూర్య కోల్‌కతాకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. దీంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ సెంచరీ వృథా అయింది. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా.. కోల్‌కతాకు వరుసగా రెండో ఓటమి. సూర్యకు సారథ్యం అప్పగించిన రోహిత్‌ శర్మ.. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలో దిగడం విశేషం. సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.

ముంబయి అదరగొట్టింది. ఐపీఎల్‌-16 తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. మూడో మ్యాచ్‌తో గాడిన పడ్డ ఈ మాజీ ఛాంపియన్‌.. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆదివారం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. మొదట కేకేఆర్‌ 185/6 స్కోరు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (104; 51 బంతుల్లో 6×4, 9×6) శతకంతో మెరిశాడు. ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (58; 25 బంతుల్లో 5×4, 5×6), సూర్యకుమార్‌ (43; 25 బంతుల్లో 4×4, 3×6) రెచ్చిపోవడంతో ముంబయి 17.4 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

మొదట ఇషాన్‌.. ఆపై సూర్య: భారీ ఛేదనలో ఆరంభం నుంచి ముంబయి చెలరేగిపోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రోహిత్‌ (20; 13 బంతుల్లో 1×4, 2×6) అండతో ఇషాన్‌ కిషన్‌.. కోల్‌కతా బౌలర్లను ఉతికి ఆరేశాడు. తొలి ఓవర్లో ఆ జట్టు స్కోరు 2 పరుగులే.. కానీ 4 ఓవర్లకు 57/0తో నిలిచిందంటే కారణం కిషనే. సిక్స్‌లతో విరుచుకుపడిన అతడు కోల్‌కతా బౌలింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. ఆ జట్టు తేరుకునేలోపే మ్యాచ్‌ను ముంబయికి అనుకూలంగా మార్చాడు. కాసేపు మెరిసిన రోహిత్‌ వెనుదిరిగినా.. ఇషాన్‌ బాదుడు ఆపలేదు. 21 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తపోయింది. అతడికి సూర్య జత కలవడంతో ముంబయి ఎక్కడా తగ్గలేదు. గత కొన్ని ఇన్నింగ్స్‌ల నుంచి పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న సూర్య.. మునుపటిలా చెలరేగాడు. తన శైలిలో 360 డిగ్రీల షాట్లతో స్కోరు బోర్డు పరుగులెత్తించాడు. ఇషాన్‌ వెనుదిరిగినా.. తిలక్‌వర్మ (30; 25 బంతుల్లో 3×4, 1×6) సహకారంతో ముంబయిని విజయం దిశగా తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ మీదగా నటరాజు పోజులో కొట్టిన సిక్సర్‌ అద్భుతం. తిలక్‌ కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడడంతో ముంబయి 13 ఓవర్లకు 147/2తో ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్లింది. స్వల్ప వ్యవధిలో తిలక్‌, సూర్య ఔటైనా.. ధాటిగా ఆడిన డేవిడ్‌ (24 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 2×6) మరో 14 బంతులు ఉండగానే జట్టును గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సుయాశ్‌ (2/27) మాత్రమే రాణించాడు.

వెంకటేశ్‌ దూకుడు: అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపులే హైలైట్‌. ఆరంభంలో జట్టు తడబడినా వెంకటేశ్‌ నిలబడ్డాడు. అరంగేట్ర పేసర్‌ అర్జున్‌ తెందుల్కర్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ ఆ తర్వాత సిక్స్‌ల జోరు కొనసాగించాడు. క్రీజు వదిలి ముందుకొస్తూ లాంగాన్‌, లాంగాఫ్‌ దిశగా బంతిని స్టాండ్స్‌లోకి పంపిన వెంకటేశ్‌.. కొన్ని మెరుపు కట్‌ షాట్లతోనూ పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి 57/2తో నిలిచిన కోల్‌కతా.. ఆ తర్వాతా అదే దూకుడుతో ముందుకెళ్లింది. గత మ్యాచ్‌లో సర్‌రైజర్స్‌పై అదరగొట్టిన కెప్టెన్‌ నితీష్‌ రాణా (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. వెంకటేశ్‌ మాత్రం జోరు తగ్గించలేదు. 200 పైన స్ట్రైక్‌ రేట్‌తో ఆడుతూ.. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి పంపాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన వెంకటేశ్‌.. మరో 26 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. కానీ వెంకటేశ్‌ తప్ప మిగిలిన బ్యాటర్లు దూకుడుగా ఆడకపోవడంతో కోల్‌కతా 17 ఓవర్లకు 155/4తో నిలిచింది. దీనికి తోడు 18వ ఓవర్లో వెంకటేశ్‌ ఔటైపోవడంతో కేకేఆర్‌ ఇబ్బంది పడింది. గత రెండు మ్యాచ్‌ల్లో మెరిసిన రింకు సింగ్‌ (18; 18 బంతుల్లో) ధాటికి ఆడలేకపోయాడు. అయితే రసెల్‌ (21 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 1×6) ఆఖర్లో బ్యాట్‌ ఝుళిపించడంతో కోల్‌కతా స్కోరు 180 దాటింది. ముంబయి బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ (2/34) ఆకట్టుకున్నాడు.


పడి లేచి..

2021 ఐపీఎల్‌ వరకు వెంకటేశ్‌ అయ్యర్‌ ఎవరో అభిమానులకు తెలియదు. కానీ ఈ సీజన్‌ ఆఖరి కల్లా అతడి సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు ఉపయుక్తమైన బౌలింగ్‌తో అదరగొట్టాడతను. ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన వెంకటేశ్‌.. భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ ఏడాది తిరిగేసరికి మొత్తం తలకిందులైంది. 2022 ఐపీఎల్‌లో ఈ ఆల్‌రౌండర్‌ 14 మ్యాచ్‌లు ఆడి 182 పరుగులే చేశాడు. పైగా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. టీమ్‌ఇండియాలోనూ చోటు కోల్పోయాడు. దీంతో 2023 సీజన్లో కోల్‌కతా అతడిని నేరుగా జట్టులోకి తీసుకోలేదు. పంజాజ్‌తో తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దించింది. ఆ మ్యాచ్‌లో వేగంగా ఆడలేకపోయిన ఆ తర్వాత ఆర్సీబీపై (3) కూడా విఫలమయ్యాడు. ఇంకా అతడికి కష్టమే అనుకుంటున్న సమయంలో గుజరాత్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ (83; 40 బంతుల్లో) వెంకటేశ్‌కు ఊపిరి పోసింది. కోల్‌కతా 200పైన లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలకమయ్యాడు. దీంతో అతణ్ని ఆదివారం తుది జట్టులోకే తీసుకుంది కోల్‌కతా. ముంబయిపై చెలరేగి ఆడిన సెంచరీ చేసిన అతను జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే మళ్లీ టీమ్‌ఇండియాలోకి కూడా ప్రవేశం దక్కొచ్చు.


అర్జున్‌ ఎట్టకేలకు..

సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ ఎట్టకేలకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2021 నుంచి ముంబయి ఇండియన్స్‌తో ఉంటున్న ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్‌బౌలర్‌ తొలిసారి బరిలోకి దిగాడు. ఆదివారం కోల్‌కతా నైడ్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ముంబయి బౌలింగ్‌ దాడిని అతడే ఆరంభించాడు. రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్‌.. 17 పరుగులిచ్చాడు. వికెట్లు తీయలేదు. తొలి ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్న అతడు.. రెండో ఓవర్లో 13 సమర్పించుకున్నాడు. అర్జున్‌ బౌలింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా 4, 6 కొట్టాడు. ఐపీఎల్‌ ఆడిన (అది కూడా ఒకే జట్టుకు) తొలి తండ్రీ కొడుకుల ద్వయంగా సచిన్‌, అర్జున్‌ ఘనత సాధించారు. సచిన్‌ 2008 నుంచి 2013 వరకు ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు.


2

ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు సెంచరీ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2008 తొలి ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ విధ్వంసక సెంచరీ సాధించాక మళ్లీ ఇప్పుడు వెంకటేశ్‌ అయ్యరే మూడంకెల స్కోరును అందుకున్నాడు.


కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) డువాన్‌ (బి) చావ్లా 8;  జగదీశన్‌ (సి) షోకీన్‌ (బి) గ్రీన్‌ 0; వెంకటేశ్‌ (సి) డువాన్‌ (బి) మెరిడిత్‌ 104; నితీష్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) షోకీన్‌ 5; శార్దూల్‌ (సి) తిలక్‌ (బి) షోకీన్‌ 13; రింకు (సి) వాదెరా (బి) డువాన్‌ 18; రసెల్‌ నాటౌట్‌ 21; నరైన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌టాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185;

వికెట్ల పతనం:1-11, 2-57, 3-73, 4-123, 5-159, 6-172;

బౌలింగ్‌: అర్జున్‌ తెందుల్కర్‌ 2-0-17-0; గ్రీన్‌ 2-0-20-1; డువాన్‌ జాన్సన్‌ 4-0-53-1; చావ్లా 4-0-19-1; హృతిక్‌  షోకీన్‌ 4-0-34-2; మెరిడిత్‌ 4-0-40-1


ముంబయి: రోహిత్‌ (సి) ఉమేశ్‌ (బి) సుయాశ్‌ 20; ఇషాన్‌ (బి) వరుణ్‌ 58; సూర్య (సి) గుర్బాజ్‌ (బి) శార్దూల్‌ 43; తిలక్‌ (బి) సుయాశ్‌ 30; డేవిడ్‌ నాటౌట్‌ 24; నేహల్‌ (సి) గుర్బాజ్‌ (బి) ఫెర్గూసన్‌ 6; గ్రీన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌టాలు 4 మొత్తం: (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 186;

వికెట్ల పతనం: 1-65, 2-87, 3-147, 4-176, 5-184;

బౌలింగ్‌: ఉమేశ్‌ 2-0-19-0; శార్దూల్‌ 2-0-25-1; నరైన్‌ 3-0-41-0; సుయాశ్‌ 4-0-27-2; వరుణ్‌ 4-0-38-1; ఫెర్గూసన్‌ 1.4-0-19-1; రసెల్‌ 1-0-17-0


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు