IPL 2023: భారత క్రికెట్‌లో విరాట్‌-గంభీర వంటి మరికొన్ని ఎపిసోడ్లు..!

క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య అభిప్రాయభేదాలు సహజంగానే ఉంటాయి. కానీ, అవి డ్రెస్సింగ్‌ రూమ్‌కు మాత్రమే పరిమితం అవుతాయి. చాలా అరుదుగా మాత్రమే బహిర్గతం అవుతుంటాయి. భారత క్రికెట్‌లో అటువంటి ఘటనలు పలు చోటు చేసుకొన్నాయి.. 

Published : 02 May 2023 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌లో ‘విరాట్‌-గంభీర్‌ వివాదం’ వంటి పలు ఎపిసోడ్లు చోటు చేసుకొన్నాయి. వాటిల్లో చాలా వరకు చివరికి సుఖాంతం కాగా.. మరి కొన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహించి.. కుటుంబం వలే కలిసి ఉన్న క్రీడాకారుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ, ఇవి ముదిరి బహిర్గతం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఘటనల్లో కొన్ని..   

సచిన్‌ - కాంబ్లీ

సచిన్‌-కాంబ్లీ చిన్ననాటి మిత్రులు. హారిస్‌ షీల్డ్‌ మ్యాచ్‌లో ఇద్దరు కలిసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కొన్నేళ్ల తేడాతో ఇద్దరూ భారత జట్టుకు ఆడారు. కాంబ్లీ వివాదాల్లో చిక్కుకొని జట్టులో స్థానం కోల్పోగా.. సచిన్‌ మాత్రం టీమ్‌ ఇండియాలో సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించాడు. ఈ క్రమంలో కాంబ్లీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సచిన్‌ తనను పూర్తిగా విస్మరించాడని ఆరోపించాడు. చివరికి సచిన్‌ వీడ్కోలు ప్రసంగంలో తన పేరు కూడా పలకలేదని కాంబ్లీ బహిరంగంగానే వాపోయాడు. కానీ, ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాదం పరిష్కారమైంది. 

దినేష్‌ కార్తీక్‌ - మురళీ విజయ్‌

దినేష్‌-మురళీ ఇద్దరూ మంచి మిత్రులు. వీరు తమిళనాడు జట్టు కోసం కలిసి ఆడారు. కానీ, దినేష్‌ భార్యతో మురళీ ప్రేమలో పడటంతో వివాదం మొదలైంది. కార్తీక్‌ మౌనంగా విడాకులు తీసుకొని వీరికి దూరంగా ఉన్నాడు. అనంతరం కార్తీక్‌ స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను పెళ్లి చేసుకొన్నాడు. 

ధోనీ - యువీ

ఒకప్పుడు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో వీరిద్దరూ టీమ్‌ ఇండియాకు మూలస్తంభాలు. యువరాజ్‌ అనారోగ్యం సమయంలో జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ, కోలుకొన్నాక కూడా యువరాజ్‌ను జట్టులోకి తీసుకోవడానికి ధోనీ ఆసక్తి చూపలేదు. ఫలితంగా యువీ కెరీర్ ముగిసిపోయింది. దీనిపై యువరాజ్‌ తండ్రి, అంతర్జాతీయ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ బహిరంగంగానే ధోనీని తప్పుపట్టాడు. తన కుమారుడిని ధోనీ వెన్నుపోటు పొడిచాడని ఆరోపించాడు. యువీ కూడా రిటైర్మెంట్‌ తర్వాత చాలా సందర్భాల్లో ధోనీ తనను తగినంత ప్రోత్సహించలేదని ఆరోపించాడు.

 జడేజా

గతేడాది ఐపీఎల్‌ సమయంలో ధోనీ స్థానంలో రవీంద్ర జడేజాకు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కానీ, చెన్నై జట్టు దారుణమైన ఆటతీరును ప్రదర్శించడంతో జడేజా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ ఓటములకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనను బలి చేసిందని భావించాడు. ఈ క్రమంలో మేనేజ్‌మెంట్‌తో వివాదం జరిగినట్లు వార్తలొచ్చాయి. అతడు బయో-బబుల్‌ను వీడి ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నై పోస్టులను తన ఇన్‌స్టా నుంచి తొలగించాడు. కానీ, ఆ తర్వాత వివాదం సమసిపోవడంతో ఇప్పుడు చెన్నై జట్టు తరపునే ధోనీ సారథ్యంలో బరిలోకి దిగుతున్నాడు.

మునాఫ్‌ పటేల్‌ - అమిత్‌ మిశ్రా

ఐపీఎల్‌ 4వ సీజన్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌-ముంబయి ఇండియన్స్‌(MI) వాంఖడే స్టేడియంలో తలపడ్డాయి. డీసీ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఎంఐ తరపున 20వ ఓవర్‌ మునాఫ్‌ వేశాడు. ఆ ఓవర్‌ తొలి బంతినే మిశ్రా సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన మునాఫ్‌ పటేల్‌ ఏదో దూషించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. నాటి ముంబయి కెప్టెన్‌ సచిన్‌ జోక్యం చేసుకొని సర్దిచెప్పాడు. ఆ తర్వాత మునాఫ్‌ వేసిన మూడు బంతులను మిశ్రా బౌండరీలకు తరలిచాడు. ఐదో బంతికి పరుగు కోసం ప్రయత్నిస్తుండగా మునాఫ్‌-మిశ్రా ఢీకొన్నారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన అంపైర్‌ ఎస్‌.రవి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 

హర్బజన్‌-శ్రీశాంత్‌

హర్బజన్‌ సింగ్‌, శ్రీశాంత్‌ వివాదం భారత క్రికెట్‌లో పెనుసంచలనం రేపింది. 2008లో సచిన్‌ గైర్హాజరీతో ముంబయి ఇండియన్స్‌కు హర్బజన్‌ సింగ్‌ నాయకత్వం వహించాడు. అదే సమయంలో పంజాబ్‌ జట్టు తరపున పేస్‌ బౌలర్‌గా శ్రీశాంత్‌ బరిలోకి దిగారు. వీరిద్దరూ టీమ్‌ ఇండియాలో సహచరులే. పంజాబ్‌-ముంబయి తలపడిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌ ప్రత్యర్థి జట్టును కామెంట్‌ చేస్తూనే ఉన్నాడు. చివరికి పంజాబ్‌ 66 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కూడా శ్రీశాంత్‌ ఏదో కామెంట్‌ చేయడంతో హర్బజన్‌ సింగ్‌  సహనం కోల్పోయి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్‌ కన్నీరు పెట్టుకొన్నాడు. ఆ సీన్‌ను టీవీ కెమెరాలు బంధించాయి. శ్రీశాంత్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ యువరాజ్‌ అండగా నిలిచాడు. హర్బజన్‌పై ఐపీఎల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ, శ్రీశాంత్‌ మాత్రం విషయ తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించాడు. ఐపీఎల్‌ హర్బజన్‌పై 13 మ్యాచ్‌ల నిషేధం విధించింది. బీసీసీఐ అదనంగా ఐదు వన్డేల్లో భజ్జీపై వేటు వేసింది. దీంతో ముంబయి కెప్టెన్సీని షాన్‌ పొల్లాక్‌ చేపట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని