CSK vs KKR: కోల్‌కతా.. ఇంకా ఉంది

కోల్‌కతా ఇంకా రేసులో ఉంది. ఇప్పటికీ ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ చేరడం చాలా చాలా కష్టమే అయినా.. ఆరో విజయంతో సాంకేతికంగానైనా తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌.. బ్యాటర్లు రింకూ సింగ్‌, నితీశ్‌ రాణాల చక్కని ప్రదర్శనతో చెన్నైని కోల్‌కతా ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే చెన్నై ప్లేఆఫ్స్‌ చేరేది. ఓడినా రేసులో చాలా ముందుంది.

Updated : 15 May 2023 07:53 IST

చెన్నైపై విజయం
మెరిసిన రింకూ, రాణా
రాణించిన నరైన్‌, వరుణ్‌

కోల్‌కతా ఇంకా రేసులో ఉంది. ఇప్పటికీ ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ చేరడం చాలా చాలా కష్టమే అయినా.. ఆరో విజయంతో సాంకేతికంగానైనా తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌.. బ్యాటర్లు రింకూ సింగ్‌, నితీశ్‌ రాణాల చక్కని ప్రదర్శనతో చెన్నైని కోల్‌కతా ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే చెన్నై ప్లేఆఫ్స్‌ చేరేది. ఓడినా రేసులో చాలా ముందుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. శివమ్‌ దూబె (48 నాటౌట్‌; 34 బంతుల్లో 1×4, 3×6) పోరాటంతో మొదట చెన్నై 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. నరైన్‌ (2/15), వరుణ్‌ చక్రవర్తి (2/36) ఆ జట్టుకు కళ్లెం వేశారు. రింకూ సింగ్‌ (54; 43 బంతుల్లో 4×4, 3×6), నితీశ్‌ రాణా (57 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 1×6) మెరవడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై (15), కోల్‌కతా (12)లకు ఇక ఈ సీజన్‌లో  ఒక్కో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది.

కోల్‌కతా తడబడ్డా..!: లక్ష్యం స్వల్పమే అయినా కోల్‌కతా ఆరంభం చూస్తే.. ఛేదన ఆ జట్టుకు తేలికేమీ కాదనిపించింది. దీపక్‌ చాహర్‌ (3/27) ధాటికి కోల్‌కతా 5 ఓవర్లలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కానీ రింకూ సింగ్‌, నితీశ్‌ రాణా నిలబడ్డారు. నెమ్మదిగానే అయినా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. మొదట్లో పరుగులు తేలికగా రాకున్నా ఇద్దరూ క్రమంగా బ్యాట్‌ ఝుళిపించారు. చకచకా బౌండరీలు బాదేస్తూ జట్టును వడివడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. 8 ఓవర్లలో 53/3తో నిలిచిన కోల్‌కతా.. వీళ్ల దూకుడుతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 117/3తో నిలిచింది. చివరి అయిదు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో కోల్‌కతా విజయం లాంఛనమే. రింకూ రనౌటైనా.. రసెల్‌ (2 నాటౌట్‌)తో కలిసి రాణా పని పూర్తి చేశాడు. జట్టు స్కోరు 67 వద్ద పతిరన క్యాచ్‌ వదిలేయడం రాణాకు కలిసొచ్చింది. ధోని క్యాచ్‌ చేజార్చడంతో ఏడో ఓవర్లోనూ అతడికి జీవనదానం లభించింది. రింకూ, రాణా నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. పిచ్‌ చెన్నై ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఉన్నంత కఠినంగా కోల్‌కతా ఛేదనలో లేదు.

చెన్నైకి కళ్లెం: పరుగుల కోసం చెన్నై చెమటోడ్చింది. స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బ్యాట్‌ ఝుళిపించలేకపోయిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శివమ్‌ దూబె పుణ్యమా అని కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించింది. అయిదు ఓవర్లు పూర్తయ్యేసరికి రుతురాజ్‌ (17) వికెట్‌ కోల్పోయి 48 పరుగులు చేసింది. కాన్వే కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు. అయితే అయిదు ఓవర్ల తర్వాత సూపర్‌కింగ్స్‌ పరుగుల కోసం అవస్థ పడింది. వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌ ఆ జట్టును కట్టిపడేశారు. చకచకా వికెట్లూ తీశారు. 11 పరుగుల వ్యవధిలో రహానె (16), కాన్వే (30), రాయుడు (4), మొయిన్‌ అలీ (1) వికెట్లు కోల్పోయిన చెన్నై 11 ఓవర్లలో 72/5తో నిలిచింది. 6 నుంచి 11 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదంటే చెన్నై పరుగుల కోసం ఎంత ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు. సిక్స్‌లు, ఫోర్ల సంగతి అటుంచితే.. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కనీసం సింగిల్స్‌ తీయడం కూడా కష్టమైపోయింది. అయితే జడేజా (20; 24 బంతుల్లో 1×6)తో కలిసి దూబె చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ప్రతికూల పరిస్థితుల్లో, ఒత్తిడిలో అతడు అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 12వ ఓవర్లో అతడు కొట్టిన సిక్స్‌తోనే ఇన్నింగ్స్‌ వేగం కాస్త పెరిగింది. 17వ ఓవర్లో సూయాశ్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు దంచేయడం ద్వారా స్కోరు బోర్డుపై దూబె విలువైన పరుగులు చేర్చాడు. ఆ తర్వాత వరుణ్‌ చక్రవర్తి ఓవర్లోనూ ఓ సిక్స్‌ దంచేశాడు. అతడి దూకుడుతో చివరి అయిదు ఓవర్లలో చెన్నై 52 పరుగులు రాబట్టింది. జడేజా ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. అతడితో ఆరో వికెట్‌కు దూబె 68 పరుగులు జోడించాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) వైభవ్‌ (బి) వరుణ్‌ 17; కాన్వే (సి) రింకూ (బి) శార్దూల్‌ 30; రహానె (సి) రాయ్‌ (బి) వరుణ్‌ 16; రాయుడు (బి) నరైన్‌ 4; శివమ్‌ దూబె నాటౌట్‌ 48; మొయిన్‌ అలీ (బి) నరైన్‌ 1; జడేజా (సి) వరుణ్‌ (బి) వైభవ్‌ 20; ధోని నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-31, 2-61, 3-66, 4-68, 5-72, 6-140; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-30-1; హర్షిత్‌ రాణా 2-0-19-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-36-2; నరైన్‌ 4-0-15-2; శార్దూల్‌ 3-0-15-1; సుయాశ్‌ 3-0-29-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) పతిరన (బి) చాహర్‌ 12; గుర్బాజ్‌ (సి) తుషార్‌ (బి) చాహర్‌ 1; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) జడేజా (బి) చాహర్‌ 9; నితీశ్‌ రాణా నాటౌట్‌ 57; రింకూ సింగ్‌ రనౌట్‌ 54; రసెల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 147; వికెట్ల పతనం: 1-4, 2-21, 3-33, 4-132; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-27-3; తుషార్‌ దేశ్‌పాండే 3.3-0-25-0; మొయిన్‌ అలీ 4-0-31-0; తీక్షణ 3-0-22-0; పతిరన 3-0-23-0; జడేజా 2-0-18-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని