జకో అందుకునేనా?

టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు.. 23 ట్రోఫీలతో శిఖరాగ్రానికి చేరేందుకు.. నాదల్‌ లేని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జయకేతనం ఎగరేసేందుకు జకోవిచ్‌ సిద్ధమయ్యాడు.

Published : 28 May 2023 02:59 IST

23వ టైటిలే లక్ష్యం
మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా స్వైటెక్‌
నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌
నాదల్‌ దూరం

టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు.. 23 ట్రోఫీలతో శిఖరాగ్రానికి చేరేందుకు.. నాదల్‌ లేని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జయకేతనం ఎగరేసేందుకు జకోవిచ్‌ సిద్ధమయ్యాడు. ఆదివారం ఆరంభం కానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 16 ఏళ్లలో టైటిల్‌ నిలబెట్టుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పాలనే ధ్యేయంతో స్వైటెక్‌ సమరానికి సై అంటోంది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఈ పేరు వినగానే ఎర్రమట్టి కోర్టుపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే దిగ్గజం రఫెల్‌ నాదల్‌ గుర్తుకొస్తాడు. 2005లో ఈ గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రం చేసి.. 2022 వరకు వరుసగా 18 టోర్నీల్లో ఆడి 14 సార్లు విజేతగా నిలిచాడు. కానీ తుంటి గాయంతో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈ సారి నాదల్‌ లేని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నొవాక్‌ జకోవిచ్‌ ఉన్నాడు. ప్రస్తుతం చెరో 22 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో నాదల్‌, జకో సమంగా ఉన్నారు. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జకో ఇప్పటివరకూ కేవలం రెండు (2016, 2021) సార్లు మాత్రమే విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన జకోకు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌కు మధ్య స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కారస్‌ అడ్డుగా మారే ప్రమాదం ఉంది.  మరోవైపు రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), నిరుటి రన్నరప్‌ రూడ్‌ (నార్వే), సిట్సిపాస్‌ (గ్రీస్‌), హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌), రుబ్లెవ్‌ (రష్యా), జ్వెరెవ్‌ (జర్మనీ) కూడా ట్రోఫీ కోసం గట్టిగానే పోరాడనున్నారు.

ఆ ముగ్గురిలో ఎవరో?: మహిళల సింగిల్స్‌ ట్రోఫీ కోసం పోటీ ప్రధానంగా ఇగా స్వైటెక్‌ (పోలండ్‌), సబలెంక (బెలారస్‌), రిబకినా (కజకిస్థాన్‌) మధ్య ఉండనుంది. గత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ఈ ముగ్గురే పంచుకున్నారు. ఇందులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌ వరుసగా రెండో సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి.. 2007 (జస్టిన్‌ హెనిన్‌) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలవాలనే పట్టుదలతో ఉంది. 21 ఏళ్ల ఈ ప్రపంచ నంబర్‌వన్‌ 2020లోనూ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సొంతం చేసుకుంది. వింబుల్డన్‌ ఛాంపియన్‌ రిబకినా ఈ ఏడాది రోమ్‌, ఇండియన్‌ వెల్స్‌ టైటిళ్లు గెలిచింది. రెండో సీడ్‌ సబలెంక కూడా జోరుమీదుంది. గతేడాది రన్నరప్‌ కోకోగాఫ్‌, మూడో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా), గార్సియా (ఫ్రాన్స్‌), జాబెర్‌ (ట్యూనీసియా), అజరెంకా (బెలారస్‌) కూడా ట్రోఫీపై కన్నేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని