India vs West Indies 2023: కొత్తగా.. కొత్తకొత్తగా..

వెస్టిండీస్‌తో సిరీస్‌.. అది కూడా టెస్టు మ్యాచ్‌లు.. ఇంకేముంది భారత్‌ ఏకపక్ష విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి.

Updated : 12 Jul 2023 07:47 IST

నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు
ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌
కుర్రాళ్లపైనే అందరి దృష్టి
రొసో (డొమినికా)

సంధి దశకు సిద్ధమవుతున్న భారత టెస్టు జట్టులోకి కొత్త రక్తం వచ్చే వేళ ఇది. రేపటి తరం ఆటగాళ్లు అరంగేట్రం చేయాల్సిన సమయం ఇది. వరుసగా రెండు సార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరినా.. తుదిమెట్టుపై బోల్తా పడ్డ టీమ్‌ఇండియాకు కొత్త డబ్ల్యూటీసీ ఆరంభం ఇది.


కొంత విరామం తర్వాత.. కొన్ని  పరిణామాల తర్వాత.. మళ్లీ కొత్తగా టీమ్‌ఇండియా ప్రయాణం మొదలవుతోంది. కరీబియన్‌ గడ్డపై రెండు టెస్టుల సిరీస్‌తోనే మార్పునకు శ్రీకారం. ఇందులో తొలి మ్యాచ్‌కు ప్రారంభం నేడే. మరి తుది జట్టులోకి వచ్చేది ఎవరు? అవకాశాలను అందిపుచ్చుకునేది ఎవరు? సిరీస్‌ను రోహిత్‌సేన ఎలా ఆరంభించబోతోంది?


వెస్టిండీస్‌తో సిరీస్‌.. అది కూడా టెస్టు మ్యాచ్‌లు.. ఇంకేముంది భారత్‌ ఏకపక్ష విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో సందేహం కూడా లేదు! ప్రత్యర్థి దేశంలో ఆడుతున్నప్పటికీ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌. జట్టు ఎలాగో గెలుస్తుందని అందరిలోనూ నమ్మకం. అయితే కేవలం విజయం కోసమో.. ట్రోఫీ కోసమో కాదు.. ఈ సిరీస్‌ చూసేందుకు వేరే కారణాలూ ఉన్నాయి. టెస్టు జట్టులో సీనియర్ల ప్రయాణం ముగింపు దిశగా సాగుతున్న ఈ సంధి కాలంలో జట్టులోకి కుర్రాళ్లు వస్తున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జట్టు బాధ్యతలు మోసేందుకు సిద్ధమంటున్నారు. ఆ కుర్రాళ్లే ఈ సిరీస్‌పై ఆసక్తి పెంచుతున్నారు. బుధవారం ఆరంభమయ్యే తొలి టెస్టులో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు 2023-25 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌కు ఇదే తొలి సిరీస్‌ కాబట్టి ఘన విజయంతో ప్రయాణాన్ని మళ్లీ కొత్తగా మొదలెట్టాలని జట్టు భావిస్తోంది.

మూడో స్థానంలో శుభ్‌మన్‌: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న 21 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ బుధవారం అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో అతను ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. రోహిత్‌తో కలిసి అతను ఓపెనింగ్‌ చేయనున్నాడు. యశస్వి కోసం శుభ్‌మన్‌ ఓపెనింగ్‌ స్థానాన్ని వదులుకుని పుజారా ఖాళీ చేసిన మూడో స్థానంలో ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని రోహిత్‌ ధ్రువీకరించాడు. ఇక ఇషాన్‌ కిషాన్‌కూ తొలి టెస్టు ఆడే అవకాశం దక్కొచ్చు. ఆడిన 5 టెస్టుల్లో ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ల వెనుకాల అతను మెరుగ్గానే రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది కాబట్టి వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం దృష్ట్యా భరత్‌నే కొనసాగించే అవకాశాలూ లేకపోలేదు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, రహానె.. జట్టులో సీనియర్లుగా వీళ్లు బ్యాట్‌తో రాణించి కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం ఉంది.  బ్యాటింగ్‌ భారాన్ని ప్రధానంగా మోయాల్సింది ఈ అనుభవజ్ఞులే. సారథిగానూ రోహిత్‌కు ఈ సిరీస్‌ పరీక్షే. ఏడాదిన్నర విరామం తర్వాత ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం జట్టులోకి వచ్చిన రహానె.. ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరం. అతను విఫలమైతే మాత్రం అవకాశం అందుకోవడానికి రుతురాజ్‌ సిద్ధంగా ఉన్నాడు.

ముకేష్‌ ఆడతాడా?: వెస్టిండీస్‌తో పోల్చి చూస్తే పేస్‌ బౌలింగ్‌ పరంగా భారత్‌కు అనుభవ లేమి ఉందన్నది స్పష్టం. 19 టెస్టులే ఆడిన సిరాజ్‌ పేస్‌ దళాన్ని నడిపించనున్నాడు. మరో పేసర్‌గా శార్దూల్‌ (9 టెస్టులు) ఆడడం ఖాయం! దీంతో మూడో పేసర్‌గా జైదేవ్‌ ఉనద్కత్‌, నవ్‌దీప్‌ సైని, ముకేష్‌ కుమార్‌లో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరం. 29 ఏళ్ల ముకేష్‌ అరంగేట్రం చేసే అవకాశాలే ఎక్కువ. అలా కాదని దేశవాళీల్లో ఎంతో అనుభవం ఉన్న జైదేవ్‌ ఉనద్కత్‌ను ఆడిస్తారేమో చూడాలి. ఇక అశ్విన్‌, జడేజా స్పిన్‌ బాధ్యతలు పంచుకుంటారు.  

విండీస్‌ పుంజుకునేనా?: ఇటీవల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో దారుణమైన ప్రదర్శనతో.. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌ టెస్టుల్లో ఏ మేరకు నిలబడుతుందన్నది ఇక్కడ ప్రశ్న. టీ20 మోజులో పడిపోయి వన్డేల్లోనే పేలవ ప్రదర్శన చేస్తున్న ఆ జట్టు.. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో ఎలా రాణిస్తుందో చూడాలి. మ్యాచ్‌ అయిదు రోజుల వరకూ వెళ్లాలన్నా కరీబియన్‌ ఆటగాళ్లు గొప్పగా పోరాడాల్సిందే. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో పాటు త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌, బ్లాక్‌వుడ్‌ కీలకం కానున్నారు. పేస్‌ బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. కీమర్‌ రోచ్‌, గాబ్రియల్‌, అల్జారి జోసెఫ్‌, హోల్డర్‌ కలిసి బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో భారత బ్యాటర్లకు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. భారీకాయుడైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రఖీమ్‌ కార్న్‌వాల్‌ విండీస్‌ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, శుభ్‌మన్‌, కోహ్లి, రహానె, కేఎస్‌ భరత్‌/ఇషాన్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, సిరాజ్‌, ముకేష్‌/ఉనద్కత్‌;

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌, రీఫర్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, బ్లాక్‌వుడ్‌, అథనేజ్‌, జోష్వా ద సిల్వా, హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌, షనోన్‌ గాబ్రియల్‌


పిచ్‌

రోజోలోని విండ్సర్‌ పార్క్‌ స్టేడియం సంప్రదాయ టెస్టు పిచ్‌కు పెట్టింది పేరు. ఇది ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. బ్యాటర్లు కుదురుకుంటే పరుగులు సాధించొచ్చు. చివరి రెండు రోజుల్లో స్పిన్నర్ల ఆధిపత్యం సాగే ఆస్కారముంది. ఈ పిచ్‌పై చివరగా ఇక్కడ 2017 మేలో టెస్టు జరిగింది. 2011లో ఇక్కడ ఆడిన ఏకైక టెస్టును భారత్‌ డ్రా చేసుకుంది.


98

ఇప్పటివరకూ భారత్‌, వెస్టిండీస్‌ ఆడిన టెస్టులు. ఇందులో టీమ్‌ఇండియా 22 గెలిస్తే, విండీస్‌ 30 నెగ్గింది. 46 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


3

700 అంతర్జాతీయ వికెట్లు సాధించేందుకు అశ్విన్‌కు అవసరమైన వికెట్లు.


2-0

వెస్టిండీస్‌లో చివరగా 2019లో ఆడిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు