Yuvraj Singh: ఆందోళనకరంగా మిడిలార్డర్‌: యువరాజ్‌

భారతీయులుగా స్వదేశంలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని, కానీ జట్టు మిడిలార్డర్‌ ఆందోళన కలిగిస్తోందని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Updated : 09 Aug 2023 07:04 IST

దిల్లీ: భారతీయులుగా స్వదేశంలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని, కానీ జట్టు మిడిలార్డర్‌ ఆందోళన కలిగిస్తోందని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరో రెండు నెలల్లోపే స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ (అక్టోబర్‌ 5న) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ‘‘నేను భారతీయుణ్ని. కానీ ఆటగాళ్ల గాయాల కారణంగా టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో సవాలు తప్పదు. అలాంటి మ్యాచ్‌ల్లో ప్రయోగాలు చేయొద్దు. ఓపెనర్‌తో పోలిస్తే మిడిలార్డర్‌ బ్యాటర్‌ నైపుణ్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. మిడిలార్డర్‌లో ఆడే ఆటగాళ్ల కోసం జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా పని చేస్తున్నారా? అన్నది ఇక్కడ ప్రశ్న. ఒక వేళ మిడిలార్డర్‌ సిద్ధంగా లేకపోతే.. ఎవరైనా ఆ పని పూర్తిచేయాలి. ఓపెనర్లు త్వరగా ఔటైపోతే భాగస్వామ్యం నమోదు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మిడిలార్డర్‌ ఆటగాళ్లంటే క్రీజులోకి రాగానే బాదడం మొదలెట్టే వాళ్లు కాదు. ఒత్తిడిని తట్టుకుని, కొన్ని బంతులు వదిలేస్తూ, భాగస్వామ్యం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టమైన పని. అందుకు అనుభవం ఉన్న ఆటగాళ్లు కావాలి’’ అని యువీ తెలిపాడు. గాయాల నుంచి కోలుకుంటున్న శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమైన నేపథ్యంలో వన్డేల్లో మిడిలార్డర్‌లో సరైన ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో భారత్‌ ఇబ్బంది పడుతోంది. ప్రపంచకప్‌ వరకు శ్రేయస్‌, రాహుల్‌ కోలుకుంటారనే వార్తల నేపథ్యంలో.. ఆ మెగా టోర్నీకి వీళ్లు ఏ మేరకు సంసిద్ధమవుతారన్నది కీలకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని