Asia Cup Final - IND vs SL: ఆ కప్పు ముంగిట.. ఈ కప్పు కొట్టాలి

సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలవాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

Updated : 17 Sep 2023 07:33 IST

శ్రీలంకతో  భారత్‌ అమీతుమీ
ఆసియాకప్‌ ఫైనల్‌ నేడే
మధ్యాహ్నం 3 నుంచి

సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలవాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కానీ ఆ కప్పుని అందుకునే దిశగా భారత్‌ సరైన దిశగానే అడుగులు వేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడో పరీక్ష ఎదురవుతోంది. ఆసియా కప్‌ ఫైనల్‌ ఆదివారమే. వరుస విజయాలతో సునాయాసంగానే ఫైనల్‌ చేరినా, నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో కంగుతిన్న రోహిత్‌ సేన.. తుదిపోరులో శ్రీలంకను ఢీకొనబోతోంది. ఆసియా స్థాయిలో విజేతగా నిలిస్తే.. ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. మరి సొంతగడ్డపై శ్రీలంక అంత తేలిగ్గా లొంగుతుందా?

కొలంబో

హోరాహోరీ సమరాలు.. వరుణుడి దోబూచులాట.. కొన్ని సంచలన ఫలితాల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న ఆసియా కప్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆతిథ్య శ్రీలంకతో టీమ్‌ఇండియా ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయిదేళ్లుగా రెండు కంటే ఎక్కువ జట్లు పోటీ పడే ఏ టోర్నీలోనూ టైటిల్‌ గెలవని టీమ్‌ఇండియా.. ఆసియా కప్‌ను నెగ్గి ప్రపంచకప్‌ ముంగిట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటోంది. టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రోహిత్‌ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌. కాకపోతే ప్రధాన ఆటగాళ్లను పలువురిని పక్కన పెట్టి ఆడిన నామమాత్ర మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడటం రోహిత్‌ సేన ఉత్సాహాన్ని కొంత తగ్గించేదే. పైగా శ్రీలంకతో అంత సులువు కాదని సూపర్‌-4 మ్యాచ్‌లోనే భారత్‌కు అర్థమైంది. బలమైన పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌ చేరిన లంకేయులు.. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని టీమ్‌ఇండియాకు సవాల్‌ విసురుతారనడంలో సందేహం లేదు.

సమష్టిగా చెలరేగితేనే..: శ్రీలంకను ఓడించాలంటే భారత బ్యాటర్లు సమష్టిగా చెలరేగాల్సిందే. టోర్నీలో పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో మినహా ప్రధాన బ్యాటర్లు నిలకడగా రాణించలేదు. ఫామ్‌ అందుకున్న ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ జట్టుకు మరోసారి మంచి ఆరంభాన్నివ్వాల్సిన అవసరముంది. శుభ్‌మన్‌ బంగ్లాపై అద్భుత శతకం చేయగా.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ అర్ధశతకాలు సాధించాడు. ఫైనల్లో ఈ జోడీ శుభారంభం అందిస్తే సగం విజయం సాధించినట్లే. లంకపై సూపర్‌-4 మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. మిడిలార్డర్లో రాహుల్‌, హార్దిక్‌, జడేజా కీలకం. సూపర్‌-4 మ్యాచ్‌లో అదిరే ఆరంభం తర్వాత స్పిన్నర్‌ వెల్లలాగే ధాటికి భారత్‌ ఎలా తడబడిందో తెలిసిందే. ఫైనల్‌ పిచ్‌ ఆ స్థాయిలో, స్పిన్‌ స్వర్గధామంలా ఉండకపోవచ్చు కానీ.. స్పిన్నర్ల హవా ఉండటం ఖాయం. కాబట్టి వెల్లలాగె, ఇతర స్పిన్నర్లను జాగ్రత్తగా ఆడాల్సిందే. పేసర్‌ పతిరనతోనూ ముప్పు పొంచి ఉంది. ప్రధాన స్పిన్నర్‌ తీక్షణ గాయపడి ఫైనల్‌కు దూరం కావడం భారత్‌కు కొంత కలిసొచ్చేదే. కానీ ధనంజయ డిసిల్వా, అసలంకల రూపంలో లంకకు మెరుగైన ప్రత్యామ్నాయాలున్నాయి.

తిలక్‌ ఉంటాడా?: బంగ్లా మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ ఫైనల్లో ఆడే అవకాశాలు లేకపోలేదు. తన తొలి వన్డేలో 5 పరుగులే చేసినప్పటికీ తిలక్‌కు ఇంకో అవకాశం ఇవ్వాలనుకుంటోంది భారత్‌. శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం తిరగబెట్టడంతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. ప్రపంచకప్‌కు కూడా అతను అనుమానంగా మారాడు. అతడి స్థానాన్ని తిలక్‌తో భర్తీ చేసే అవకాశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది. ఈలోపు అతను మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టు యాజమాన్యాన్ని మెప్పించాల్సిన అవసరముంది. తిలక్‌ను ఆడించాలనుకుంటే ఇషాన్‌ను పక్కన పెట్టే అవకాశముంది. బౌలింగ్‌లో కొన్ని మార్పులు జరగనున్నాయి. బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ తుది జట్టులోకి తిరిగి రానున్నారు. టోర్నీలో పెద్దగా రాణించని షమి, గాయాలతో ఇబ్బంది పడుతున్న అక్షర్‌ పటేల్‌ ఫైనల్లో ఆడే అవకాశాలు లేవు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే వాషింగ్టన్‌ సుందర్‌.. లేదంటే శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులో ఉంటారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కుశాల్‌ మెండిస్‌తో పాటు నిశాంక, అసలంక, శానకల నుంచి భారత బౌలర్లకు ముప్పు పొంచి ఉంది. కుశాల్‌ పెరీరా కూడా ప్రమాదకర ఆటగాడే. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ మరోసారి విజృంభిస్తాడని జట్టు ఆశిస్తోంది. పేస్‌ బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్‌ కీలకం. ఆరంభ ఓవర్లలో వీళ్లిద్దరూ వికెట్లు తీస్తే.. తర్వాత కుల్‌దీప్‌ చూసుకుంటాడు.

పిచ్‌ స్పిన్నర్లదే

కొలంబోలో మ్యాచ్‌ అంటే స్పిన్నర్లదే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ టోర్నీలోనూ ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో వారే ఆధిపత్యం చలాయించారు. ఆదివారం కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఉండదు. పేసర్లకు కూడా కొంత సహకారం ఉంటుంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిందే.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, రాహుల్‌, ఇషాన్‌/తిలక్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌/సుందర్‌, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌.

శ్రీలంక: నిశాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, అసలంక, శానక, ధనంజయ డిసిల్వా, వెల్లలాగె, హేమంత, రజిత, పతిరన.

వర్షం ముప్పు.. రిజర్వ్‌ డే ఉంది

సియా కప్‌ను ఆరంభం నుంచి వెంటాడుతున్న వరుణుడు ఆదివారం ఫైనల్‌ను కూడా వదిలిపెట్టేలా లేడు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉంది. మ్యాచ్‌ సమయంలో వర్షం పడేందుకు 50 శాతం అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మ్యాచ్‌ పూర్తిగా రద్దుకాకపోవచ్చని సమాచారం. భారత్‌-పాక్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను కేటాయించినట్లే ఫైనల్‌కూ ఆ అవకాశం కల్పించారు. ఆదివారం ఫైనల్‌ జరగకపోతే సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.


7

భారత్‌ గెలిచిన ఆసియాకప్‌లు. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అదే. శ్రీలంక (6) రెండో స్థానంలో ఉంది.


11

టోర్నీలో పతిరన వికెట్లు. అతనే నంబర్‌వన్‌. కుల్‌దీప్‌, వెల్లలాగె పదేసి వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.


275

ప్రస్తుత ఆసియాకప్‌లో శుభ్‌మన్‌ గిల్‌ పరుగులు. అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.


‘‘ప్రపంచకప్‌ ముంగిట విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. సరైన సమయంలో పతాక స్థాయిని అందుకోవడం కీలకం. ఆసియా కప్‌ గెలవడం మాకెంతో అవసరం. ఇక్కడ గెలిస్తే ప్రపంచకప్‌కు మా ఆత్మవిశ్వాసం మరో స్థాయిలో ఉంటుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓడినా మా ఊపేమీ తగ్గలేదు. అందులో కొన్ని పరుగులు అదనంగా ఇచ్చేశాం. అది తప్పితే మా ప్రదర్శన బాగానే సాగింది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆసియా కప్‌ ఫైనల్లో, ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాం’’

శుభ్‌మన్‌ గిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని