టికెట్లో రామచంద్ర!

ఐపీఎల్‌-17 ఆతిథ్యానికి హైదరాబాద్‌ సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్‌లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబైంది. అటు సన్‌రైజర్స్‌ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.

Updated : 27 Mar 2024 07:37 IST

ఈనాడు - హైదరాబాద్‌

పీఎల్‌-17 ఆతిథ్యానికి హైదరాబాద్‌ సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్‌లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబైంది. అటు సన్‌రైజర్స్‌ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. కానీ సగటు క్రికెట్‌ అభిమాని మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయాడు. తమ అభిమాన ఆటగాళ్ల మెరుపుల్ని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టాలనుకుంటున్న ప్రేక్షకులకు ఆన్‌లైన్‌ టికెట్ల కొనుగోలు పెద్ద జూదంలా మారిపోయింది. తెర వెనుక ఏం జరుగుతోందో కానీ.. ఆన్‌లైన్లో టికెట్‌ కొనడం మాత్రం అసాధ్యమైన ప్రక్రియగా మారిపోయింది.

మహేంద్రసింగ్‌ ధోని.. భారత క్రికెట్లో సమున్నత శిఖరం. ధోనీ బ్యాటింగ్‌ వీక్షించాలని.. కుదిరితే మైదానంలో అతడిని చూడాలని కోరుకునే అభిమానులు కోకొల్లలు. నిరుడు ఐపీఎల్‌లో దేశవ్యాప్తంగా ధోని ఎక్కడికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. అయితే గత ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే భాగ్యం హైదరాబాద్‌కు దక్కలేదు. చెన్నై జట్టు చివరి సారిగా 2019లో ఉప్పల్‌ స్టేడియంలో ఆడింది. కరోనా, ఇతర కారణాల వల్ల తర్వాత ఇక్కడ మ్యాచే జరగలేదు. అయిదేళ్ల తర్వాత ఉప్పల్‌ గడ్డపై ధోని కనిపించబోతున్నాడు. ఏప్రిల్‌ 5న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోని ఆడనున్నాడు. కెరీర్‌లో ధోనీకిదే ఆఖరి సీజన్‌ అని భావిస్తున్న నేపథ్యంలో చివరగా ధోని ఆట చూడాలని అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. అయితే.. ఈ అవకాశాన్ని కొందరు క్రికెట్‌ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారని.. సగటు అభిమానులకు టికెట్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బ్లాక్‌లో విక్రయాలు?: చెన్నై మ్యాచ్‌ టికెట్లను సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే కొద్దిసేపటికే టికెట్లన్నీ అమ్ముడైనట్లు చూపిస్తుండటం గమనార్హం. సుమారు 40,000 సామర్థ్యమున్న ఉప్పల్‌ స్టేడియంలో ప్రస్తుతం 20,000  ధర కలిగిన టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 750, 2500 వంటి తక్కువ ధర టిక్కెట్లు ఒక్కటీ లేకపోవడం సగటు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆన్‌లైన్‌ సంస్థతో కలిసి కొంతమంది క్రికెట్‌ పెద్దలు పెద్ద ఎత్తున టికెట్లను బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ అభిమానులు కొనలేని అధిక ధర కలిగిన టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. కాంప్లిమెంటరీ పాసులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా క్లబ్‌ల కార్యదర్శులతో పాటు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్లకు కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారు. చెన్నై మ్యాచ్‌ విషయంలో క్రికెటర్ల కాంప్లిమెంటరీ పాసులకు హెచ్‌సీఏ పెద్దలు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాక కార్పొరేట్‌ బాక్సుల్ని మాజీ క్రికెటర్ల పేర్ల మీద బ్లాక్‌ చేశారని సమాచారం. దక్షిణ, ఉత్తర స్టాండ్లలోని కార్పొరేట్‌ బాక్సుల్లో ఒక్కొక్కటి సుమారు రూ.5 లక్షలు నుంచి రూ.6 లక్షల మధ్య ధర నిర్ణయించారు! దక్షిణ స్టాండ్‌లోని కార్పొరేట్‌ బాక్సుల్ని బ్లాక్‌ చేసి సినిమా వాళ్లు, పారిశ్రామికవేత్తలకు రూ.15 లక్షల ధరకు విక్రయిస్తున్నట్లు క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టిక్కెట్లను బ్లాక్‌ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిస్తున్నా.. పోలీసుల్లో కదలిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆన్‌లైన్‌లో ఎవరు, ఎన్ని టికెట్లు కొన్నారన్న వివరాలు ఆరా తీస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌ను ‘ఈనాడు’ సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని