CWG 2022: ఆకాశం మీ హద్దురా..

కామన్వెల్త్‌ క్రీడలు ముగిశాయి. అందులో మన దేశం నుంచి 61 మంది పతక విజేతలు. వీళ్లందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వీళ్లందరి జీవితం పూల పాన్పేమీ కాదు. ఒకరు రైతు బిడ్డ.. ఇంకొకరు ఛాయ్‌వాలా.. ఒకరు మూటలు మోశారు.. మరొకరు గడ్డి కోశారు.. ఒకరికి తండ్రి లేడు.. మరొకరికి చేతుల్లో డబ్బు లేదు! అందరూ మనలాంటి వాళ్లే. వాళ్లకూ మనలాంటి అడ్డంకులే! కానీ వాళ్లు అందరిలా మిగిలిపోలేదు. ఏ అడ్డంకీ వారి విజయాన్ని ఆపలేదు!

Updated : 10 Aug 2022 07:18 IST

ఈనాడు క్రీడావిభాగం

కామన్వెల్త్‌ క్రీడలు ముగిశాయి. అందులో మన దేశం నుంచి 61 మంది పతక విజేతలు. వీళ్లందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వీళ్లందరి జీవితం పూల పాన్పేమీ కాదు.
ఒకరు రైతు బిడ్డ.. ఇంకొకరు ఛాయ్‌వాలా.. ఒకరు మూటలు మోశారు.. మరొకరు గడ్డి కోశారు.. ఒకరికి తండ్రి లేడు.. మరొకరికి చేతుల్లో డబ్బు లేదు!
అందరూ మనలాంటి వాళ్లే. వాళ్లకూ మనలాంటి అడ్డంకులే! కానీ వాళ్లు అందరిలా మిగిలిపోలేదు. ఏ అడ్డంకీ వారి విజయాన్ని ఆపలేదు!
వారిని మిగతా అందరి నుంచి భిన్నంగా నిలిపింది వారి పట్టుదల.. సంకల్ప బలం! వాళ్లు గెలిచింది ఆటల్లో కావచ్చు. కానీ స్ఫూర్తినిచ్చేది మాత్రం అందరికీ!
‘‘ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి. దాని గురించే    కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనివ్వండి. ఇలా చేస్తే తప్పక మీదే విజయం’’.. అంటాడు స్వామి వివేకానంద.
ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు నెగ్గిన చాలామంది వివేకానందుడి మాటల్ని అక్షర సత్యాల్ని చేసిన వారే. ఒక లక్ష్యం పెట్టుకుని దాని కోసం ఏళ్ల తరబడి దాని కోసం కష్టపడ్డ వారిని పేదరికం, నేపథ్యం, గాయాలు, విమర్శలు.. ఇలా ఏవీ ఆపలేకపోయాయి.  ఈ విజేతల స్ఫూర్తి గాథల్ని ఓసారి తరచి చూద్దాం రండి.


ఇదిగో జవాబు

హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల నుంచే ప్రపంచ స్థాయి క్రీడాకారులు వస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ నిజామాబాద్‌ నుంచి వచ్చిన నిఖత్‌ జరీన్‌ ఇప్పుడు బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌. 17 ఏళ్ల వయసులో జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. నాలుగేళ్ల కిందట తన తప్పు లేకుండా విమర్శలు ఎదుర్కొంది. మేరీకోమ్‌ లాంటి దిగ్గజ క్రీడాకారిణి పోటీపడే విభాగంలోనే ఆడే నిఖత్‌.. టోక్యో ఒలింపిక్స్‌ ముంగిట సెలక్షన్‌ ట్రయల్స్‌ పెట్టమని న్యాయబద్ధంగా అడిగినందుకు మేరీతో తిట్లు పడింది. మేరీనే సవాలు చేసేంత ధైర్యమా అంటూ వేరే వాళ్లు కూడా ఆమెకు వంత పాడారు. తర్వాత సెలక్షన్స్‌ నిర్వహిస్తే మేరీ చేతిలో ఓడిపోవడంతో నిఖత్‌ను చాలామంది ఎగతాళి చేశారు. కానీ వాళ్లందరికీ గత మేలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణంతో సమాధానం చెప్పింది నిఖత్‌. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పసిడి చేజిక్కించుకుని దేశంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా అవతరించింది.


రన్‌ రంగంలో అభిమన్యుడు

చదువుకోవాలంటే ఇంటి నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. అలా అని చదువుకు దూరం కాలేదు. పరుగు అందుకున్నాడు. ఇంటర్‌ చదివాక ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయి. అప్పుడు అతడు భయపడిపోలేదు. పరుగు అందుకున్నాడు. సైన్యంలో చేరి.. సియాచిన్‌లో మైనస్‌ డిగ్రీల చలిలో, తీవ్ర వేడి ఉండే రాజస్థాన్‌ ఎడారుల్లో పని చేశాడు. అప్పటివరకు అవినాశ్‌ సాబలే ఓ సైనికుడు మాత్రమే. ఆటలతో అతడికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఓసారి తన రెజిమెంట్‌లో క్రాస్‌కంట్రీ రేసులో పోటీపడే అవకాశం అతడికి లభించింది. 76 కిలోల బరువున్న అతడు ఆ పరుగు కోసం తీవ్రంగా శ్రమించి బరువు తగ్గాడు. అలా మళ్లీ మొదలైన అతడి పరుగు ఇక ఆగలేదు. సర్వీసెస్‌లో తమ రెజిమెంట్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన అతడు 2017లో తొలిసారి స్టీపుల్‌ఛేజ్‌ విభాగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో రికార్డుల మీద రికార్డులు సాబలే సొంతమయ్యాయి. 2018 జాతీయ అథ్లెటిక్స్‌లో 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కొవిడ్‌ బారిన పడడంతో టోక్యో ఒలింపిక్స్‌లో రాణించలేకపోయిన అవినాశ్‌.. కామన్వెల్త్‌లో సత్తా చాటాడు. కొన్ని దశాబ్దాలుగా కెన్యా అథ్లెట్లు తప్ప మరెవరూ గెలవని 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ విభాగంలో అతడు రజతం గెలిచాడు.


చాయ్‌వాలా ఛాంపియనయ్యాడు

దేశ ప్రధాని మోదీనే తాను ఒకప్పుడు చాయ్‌వాలానని గర్వంగా చెప్పుకొంటారు. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన మహారాష్ట్ర కుర్రాడు సంకేత్‌ కూడా ‘చాయ్‌వాలా’నే కావడం విశేషం. మన నేపథ్యం ఎలాంటిదైనా నామోషీ చెందాల్సిన అవసరం లేదు, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ దిశగా పట్టుదలతో అడుగులు వేస్తే సాధించలేనిది లేదు అనడానికి సంకేత్‌ ఒక ఉదాహరణ. అతడి తండ్రి మహదేవ్‌ ఒకప్పటి వెయిట్‌లిఫ్టర్‌. అయితే ఆ ఆటలో మధ్యలో వదిలిపెట్టి కుటుంబ పోషణ కోసం సాంగ్లీ ప్రాంతంలో టీ, పాన్‌ దుకాణం పెట్టుకున్నాడు. 13 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న సంకేత్‌కు కేవలం ఆ ఆట మీదే దృష్టిపెట్టే పరిస్థితి లేదు. ఉదయం అయిదున్నరకు లేవడం.. దుకాణంలో టీ, పాన్‌ల తయారీలో తండ్రికి సాయం చేయడం.. తర్వాత వ్యాయామశాలలో లిఫ్టింగ్‌ సాధన చేయడం.. తర్వాత పాఠశాలకు వెళ్లి చదువుకోవడం.. సాయంత్రం మళ్లీ సాధన, దుకాణంలో పని.. ఇదీ అతడి దినచర్య. చదువు కోసమని ఆటను పక్కన పెట్టలేదు. ఆటలో సాధన చేయడం కోసం పని మానలేదు. పని, ఆట కోసం కష్టపడుతున్నానని చదువును అశ్రద్ధ చేయలేదు. అతను సాకులు వెతికితే ఈ రోజు ఛాంపియన్‌గా నిలిచేవాడు కాదు.


చదువులో.. ఆటలో..

ఆటల్లోకి వెళ్తే చదువు చెడిపోతుందని చాలామంది తమ పిల్లల్ని నియంత్రిస్తుంటారు. కానీ క్రీడల్లో రాణిస్తూనే చదువులోనూ సత్తా చాటేవాళ్లు కూడా ఉంటారు. చదువు చదువే, ఆట ఆటే.. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా రెండింట్లోనూ రాణించడం కొంతమందికే సాధ్యమవుతుంది. కేరళకు చెందిన శ్రీశంకర్‌ ఆ కోవకే చెందుతాడు. అతడిది క్రీడాకారుల కుటుంబం. తల్లిదండ్రులు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు. సోదరి కూడా క్రీడాకారిణే. వీరి బాటలో లాంగ్‌ జంప్‌లోకి అడుగు పెట్టిన అతను.. అందులో ఎదుగుతూనే చదువులోనూ ప్రతిభ చాటాడు. 10, 12 తరగతుల్లో 95 శాతానికి పైగా అతను మార్కులు సాధించడం విశేషం. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో క్రీడా కోటాలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించాడు. ఇలా చదువులో రాణిస్తూనే అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పోటీ పడ్డాడు. కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుని నిలిచిన అతను.. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో రజతంతో మెరిశాడు. పట్టుదల, సంకల్పం ఉంటే ఆటల్లో అదరగొడుతూనే చదువులోనూ ప్రతిభ చాటొచ్చనడానికి శంకర్‌ నిదర్శనం.


చిన్నది.. చిచ్చరపిడుగల్లే!

అంతర్జాతీయ స్థాయిలో అంతగా పేరు లేదు.. అభిమానులకు పెద్దగా అంచనాలే లేవు! అందరి కళ్లు మనిక బత్రా లాంటి స్టార్‌ మీదే! కానీ కామన్వెల్త్‌ క్రీడల్లో తన ఆటతో ఆకర్షించింది ఆకుల శ్రీజ. సింగిల్స్‌, డబుల్స్‌లో అదరగొట్టి ఔరా అనిపించింది ఈ తెలంగాణ అమ్మాయి. శరత్‌కమల్‌ను ఆరాధ్యంగా భావించే ఆమె.. అతడితో టీమ్‌గా మారి కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పసిడితో మెరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీజ కన్నా ముందు చాలా మంది టీటీ ఆడారు. కానీ ఆమె ప్రత్యేకత వేరు. రిటర్న్‌లలో వేగం.. మెరుపు సర్వీసులు శ్రీజ సొంతం. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిలోనూ పుంజుకోవడం ఆమెలోని మరో విశిష్ట గుణం. ఈ ప్రత్యేకతలతోనే అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేసింది ఈ హైదరాబాదీ. ఆడిన తొలి కామన్వెల్త్‌ క్రీడల్లోనే పోరాట యోధురాలుగా నిరూపించుకుంది. తనకన్నా మెరుగైన ర్యాంకర్లను ఎదుర్కొని నిలిచి గెలిచింది. తెలంగాణ నుంచి ఖాసిం అలీ తర్వాత సత్తా ఉన్న ప్యాడ్లర్‌గా శ్రీజ ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ఒలింపిక్స్‌ పతకం తన కల అని చెప్పే శ్రీజ మున్ముందు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరం.


శ్రమించి..సాధించి..

ఒక స్టార్‌ హీరో కొడుకు హీరో అవడం తేలికే! ఒక వ్యాపారవేత్త తనయురాలు ఆ రంగంలోకి సులువుగానే రావచ్చు! కానీ క్రీడల్లో వారసత్వాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు. ఎంతో శ్రారీరక, మానసిక శ్రమతో కూడుకున్న ఆటల్లో రాణించి ఒక స్థాయి అందుకోవడం ఆషామాషీ విషయం కాదు. గావస్కర్‌, సచిన్‌ లాంటి దిగ్గజాల పిల్లలే ఇందుకు ఉదాహరణ. అయితే పుల్లెల గోపీచంద్‌ తనయురాలు గాయత్రి మాత్రం తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. ఆమెను బ్యాడ్మింటన్‌లోకి తీసుకురావడం, ఉత్తమ శిక్షణ ఇప్పించడం గోపీ చేసి ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ స్థాయి షట్లర్‌గా ఎదగడం మాత్రం గాయత్రి ప్రతిభే. గోపీ కూతురు కాబట్టి కామన్వెల్త్‌ క్రీడల్లో నేరుగా తనకేమీ ఎంట్రీ రాదు. అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటాలి. సెలక్షన్‌ ట్రయల్స్‌లో నెగ్గాలి. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీతో కలిసి కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్న గాయత్రి.. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం సాధించి తండ్రి గర్వించేలా చేసింది. తన కుటుంబం ఉన్న స్థాయికి ఆమె ఆటల్లోకి వచ్చి అంత కష్టపడాల్సిన పని లేదు. కానీ ఆమె శ్రమించింది. సాధించింది.


గడ్డి కోసి.. పతకం ఎత్తింది

కుటుంబ పోషణ కోసం పొలంలో కష్టపడి పని చేయడం ఇప్పుడో అమ్మాయిని కామన్వెల్త్‌ పతక విజేతగా మార్చింది. తన పేరు.. హర్జీందర్‌ కౌర్‌. ఈ పేరు చూస్తే తనది పంజాబ్‌ అని అర్థమైపోతుంది. అక్కడ చాలామందిలాగే వారిది వ్యవసాయ కుటుంబం. పొలంలో తల్లిదండ్రులకు సాయపడుతూ ఆమె గడ్డి కోసే యంత్రంతో పశువులకు దాణా వేసేదే. ఈ యంత్రం మీద పని చేయడం వల్ల తన భుజాలు బలంగా తయారయ్యాయి. కబడ్డీ క్రీడాకారిణి అయిన ఆమె ఓ శిబిరంలో పాల్గొన్నపుడు తన భుజ బలం చూసిన ఓ కోచ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌కు మారమని సూచించాడు. హర్జీందర్‌ అలాగే చేసింది. సాధన మొదలుపెట్టిన కొంత కాలానికే లిఫ్టింగ్‌పై పట్టు సాధించింది. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమె కాంస్యం సాధించింది.


ఆ పోరాటం  చూసి..

సాగర్‌ అహ్లావత్‌.. 90+ కిలోల బాక్సింగ్‌లో రజతం గెలిచిన భారత బాక్సర్‌. ఇతడి విజయం.. ఓ సినిమా కథను తలపిస్తుంది. 2015లో ఫ్లాయిడ్‌ మేవెదర్‌, పకియావో మధ్య బాక్సింగ్‌ బౌట్‌ ‘ఫైట్‌ ఆఫ్‌ ద సెంచరీ’గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆ పోరాటం.. సాగర్‌ను విశేషంగా ప్రభావితం చేసింది. ఎలాగైనా బాక్సింగ్‌లోకి రావాలన్న సంకల్పాన్ని కలిగించింది. అప్పటికి అతడి వయసు పదిహేనేళ్లు. చాలా ఆలస్యమైంది. కానీ అతడు ఆగలేదు. రోజులో మూడుసార్లు సాధన. కాలువ వెంబడి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడుముకు టైర్‌ వేసుకుని పరుగెత్తడం. తన కలను సాకారం చేసుకునేందుకు సినిమాల్లో మాదిరిగా కష్టపడ్డాడు సాగర్‌. కోచ్‌ హితేశ్‌ దేశ్వాల్‌ తోడవడంతో అతడి దశ తిరిగింది. హెవీవెయిట్‌ బాక్సింగ్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. అందుకే ఒకేసారి నలుగురు బాక్సర్లతో   అతడికి పోటీ నిర్వహించేవాడు కోచ్‌. అలా తీవ్ర సాధన అనంతరం అంచలంచెలుగా ఎదిగిన సాగర్‌.. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో హెవీవెయిట్‌ విభాగంలో పతకం నెగ్గే స్థాయికి చేరుకున్నాడు. కఠోర సాధన చేస్తే ఎలాంటి కలనైనా సాకారం చేసుకోవచ్చు  అనడానికి సాగర్‌ చక్కటి ఉదాహరణ.


అన్న త్యాగం.. తమ్ముడి విజయం

అతడిది పేద కుటుంబం. తండ్రి ట్రాలీ రిక్షా కార్మికుడు. ఏపూటకు ఆ పూట కడుపు నిండితే చాలనుకునే నేపథ్యం వీరిది. అలాంటి కుటుంబంలో పెద్ద కుదుపు. తండ్రి ఆకస్మికంగా మరణించాడు. తల్లి, అన్నతో కలిసి ఆ కుర్రాడు ఎంబ్రాయిడరీ పని చేయడం మొదలుపెట్టాడు. అయితే అప్పటికే తన అన్నతో కలిసి వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన చేస్తున్న ఆ కుర్రాడు.. తమ జీవితం మారాలంటే ఆటలో ఎదగడమే మార్గం అనుకున్నాడు. అన్న ఆటను వదిలేసి అతడికి అండగా నిలిచాడు. ఓవైపు పనిలో వాళ్లిద్దరికీ సాయం చేస్తూనే అతను సాధన సాగించాడు. అతడి కష్టానికి బర్మింగ్‌హామ్‌లో ఫలితం లభించింది. 73 కేజీల విభాగంలో కామన్వెల్త్‌ క్రీడల రికార్డుతో పసిడి నెగ్గిన బెంగాల్‌ కుర్రాడు అచింత విజయ గాథ ఇది. తమ్ముడి గెలుపుతో కుటుంబ పరిస్థితి మారడంతో ఇప్పుడు అన్న కూడా తిరిగి వెయిట్‌లిఫ్టింగ్‌లోకి పునరాగమనం చేయాలని చూస్తుండడం విశేషం. తన నేపథ్యం, కుటుంబ పరిస్థితి, ఆర్థిక సమస్యలు చూసి అచింత వెనుకంజ వేసి ఉంటే.. ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేవాడు కాదు.


బరువుల కన్నా ముందు మూటలు

లవ్‌ప్రీత్‌ సింగ్‌. 100+ విభాగంలో కాంస్యంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు ఈ పంజాబ్‌ కుర్రాడు. ఈ విజయం అతడికి అంత తేలిగ్గా దక్కలేదు. బరువులెత్తడంతో తన కలలను సాకారం చేసుకోవడం కోసం మూటలు ఎత్తాడు. కూరగాయలూ అమ్మాడు! లవ్‌ప్రీత్‌ తన ఊరు బాల్‌ సచందర్‌లో కుర్రాళ్లు బరువులెత్తడం చూసి.. ఆ ప్రేరణతో వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కానీ తనను ప్రోత్సహించే స్థోమత తన పేద కుటుంబానికి లేకపోవడం అతడికి పెద్ద అడ్డంకిగా మారింది. తండ్రిది చిన్న టైలర్‌ షాప్‌. అతడి ఆదాయం తన కుమారుడి కలను నెరవేర్చడానికి ఏమాత్రం సరిపోదు. కానీ పరిస్థితులకు లవ్‌ప్రీత్‌ తలొగ్గలేదు. అదనపు డబ్బు కోసం అతడు అమృత్‌సర్‌లోని మండిలో కూరగాయల దుకాణంలో పనికి కుదిరాడు. ఉదయం 4 గంటలకే అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికొచ్చే సరికి సాయంత్రం 6 గంటలయ్యేది. ఆ తర్వాత సాధన చేసేవాడు. ఇలా చాలా సంవత్సరాలు అతడు ఇబ్బందిపడ్డాడు. కానీ అతడి శ్రమ ఫలించింది. రాష్ట్ర స్థాయిలో పతకాలు గెలవడం మొదలెట్టాక అతడి నావికాదళంలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు.


వయసు ఓ అంకె మాత్రమే

ఎప్పుడో 2006లో కామన్వెల్త్‌ క్రీడల్లో తన తొలి సింగిల్స్‌ స్వర్ణం సాధించాడు శరత్‌ కమల్‌. అప్పటికి అతడి వయసు 24 ఏళ్లు. యువ రక్తం, గొప్ప ఫిట్‌నెస్‌ ఉన్న సమయంలో ఆ పతకం శరత్‌.. తర్వాతి మూడు ప్రయత్నాల్లో ఆ విజయాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తనకు వయసు పెరుగుతూ వచ్చింది. ప్రత్యర్థుల సత్తా పెరిగింది. ఇప్పుడతడికి 40 ఏళ్లొచ్చేశాయి. ఈ వయసులో ఫిట్‌నెస్‌ అత్యంత కీలకమైన, చాలా చురుగ్గా స్పందించాల్సిన టీటీలో కొనసాగడమే కష్టం. అలాంటిది 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కామన్వెల్త్‌ క్రీడల సింగిల్స్‌ స్వర్ణం సాధించి ఔరా అనిపించాడు తమిళనాడులో స్థిరపడ్డ ఈ తెలుగు క్రీడాకారుడు. తెలుగమ్మాయే అయిన ఆకుల శ్రీజతో కలిసి అతను మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సైతం స్వర్ణం గెలవడం విశేషం. వయసు పెరిగేకొద్దీ ఓపిక, ఉత్సాహం  తగ్గిపోయి ఇక మనం ఏం సాధించలేం అనుకునే వాళ్లకు శరత్‌ విజయ గాథ ఒక పాఠమే.


ఆకలి దిద్దిన ఛాంపియన్‌

అయిదేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది.. అమ్మమ్మ దగ్గరే పెరిగాడు.. అతడి నాన్న కల్లు దుకాణంలో పని చేసేవాడు.. ఆర్థికంగా పడని బాధలు లేవు. ఈ స్థితి నుంచి కూడా ఒక ఛాంపియన్‌ తయారయ్యాడు. అతడే ఎల్డోస్‌ పాల్‌. కామన్వెల్త్‌ క్రీడల్లో ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన ఈ కుర్రాడు కేరళలోని ఎర్నాకులం జిల్లాకు దగ్గరలోని ఓ చిన్న పల్లెటూరులో పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు.. వసతులు లేవు.. పోషకాహరం లేదు ఈ స్థితిలో అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అందుకు కారణం ఒక్కటే ఆటల వల్ల అయినా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని!. ఎక్కువమంది ఎంచుకోని ట్రిపుల్‌జంప్‌లోకి రావడం అతడి పట్టుదల నిదర్శనం. ట్రిపుల్‌జంప్‌కు తగ్గ ఎత్తు లేకపోయినా మంచి పవర్‌, వేగం ఉండడంతో ఈ క్రీడలో ఎల్డోస్‌ వేగంగా ఎదిగాడు. ఆరంభంలో 14 మీటర్లే దూకేవాడు. ఆ తర్వాత ఎక్కువేం మెరుగుపడలేదు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు. ఇక ఆట వదలి చదువుకో అని కోచ్‌ సలహా ఇచ్చాడు. కానీ పాల్‌ అదృష్టాన్ని కాదు శ్రమనే నమ్మాడు. అలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి.. భారత నావికా దళంలో ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత ఆటలోనూ మెరుగైన పాల్‌ కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.


అప్పుడు మొబైల్‌లో.. ఇప్పుడు మెడలో

ఈ రోజుల్లో కాలేజీకి వెళ్లే యువతీయువకులందరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌ తప్పనిసరి. అందులో తమకు నచ్చిన హీరోనో, హీరోయినో, లేదంటే తమకు నచ్చిన కుటుంబ సభ్యుల ఫొటోనో వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం మామూలే. కానీ మిజోరాం కుర్రాడు జెరెమీ లాల్‌రినుంగా మాత్రం 2022 కామన్వెల్త్‌ క్రీడల నిర్వాహకులు పతకాల నమూనాలు విడుదల చేయగానే అందులో పసిడి చిత్రాన్ని తన మొబైల్‌ వాల్‌పేపర్‌గా మార్చుకున్నాడు. ఇప్పుడు తన విభాగంలో కామన్వెల్త్‌ క్రీడల కొత్త రికార్డు నమోదు చేస్తూ పసిడి గెలిచాడు. మొబైల్‌ వాల్‌పేపర్‌లో ఫొటోగా ఉన్న పతకం కాస్తా ఇప్పుడు వాస్తవరూపం దాల్చి అతడి మెడలో వాలింది.


ఆటల్లో రాణించాలంటే.. ‘‘కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలి’’.. ‘‘పెద్ద నగరాల్లో నివాసముండాలి’’.. ‘‘పూర్తి సమయం ఆటకే కేటాయించాలి’’.. ‘‘చదువుకు ప్రాధాన్యం ఇస్తే కష్టం’’.. ‘‘వేరే పనులేమీ పెట్టుకోకూడదు’’.. ‘‘పేరుమోసిన అకాడమీల్లో ఖరీదైన శిక్షణ తీసుకోవాలి’’.. జనంలో బలంగా నాటుకుపోయిన ఇలాంటి అభిప్రాయాలెన్నో. చాలామందికి ఆటల్లోకి రాకపోవడానికి, వచ్చినా అందులో విజయం సాధించలేకపోవడానికి ఇవి సాకులు కూడా! కానీ ఈ విజేతలు ఆ అభిప్రాయాలన్నింటినీ మార్చేశారు. ఆటలనే కాదు.. ఏ రంగంలో అయినా ఇలా వెనక్కి లాగే ఆలోచనలెన్నో! కానీ ఆత్మవిశ్వాసం ఉంటే, సంకల్పంతో అడుగులేస్తే.. ఆకాశమే మీ హద్దు!

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts