Shubman Gill: ఐపీఎల్‌లో గిల్ అరుదైన ఘనత.. సెహ్వాగ్‌ను అధిగమించిన యువ బ్యాటర్

ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాన్‌ను అధిగమించడం విశేషం.

Published : 27 May 2023 12:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకే సీజన్‌లో (IPL 2023) మూడు సెంచరీలు బాదిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో క్వాలిఫయర్‌లో ముంబయిపై ఓపెనర్‌ గిల్ 129 పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా మారాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను గిల్ అధిగమించాడు. గతంలో పంజాబ్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌.. 2014 సీజన్‌ రెండో క్వాలిఫయర్‌లో చెన్నైపై 122 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. తాజాగా గిల్ ముంబయిపై 129 పరుగులు చేయడంతో సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా మాత్రం కేఎల్ రాహుల్ (132*) కొనసాగుతున్నాడు.

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

  • ఇప్పటి వరకు మొత్తం ఏడు సార్లు గుజరాత్‌ శతక భాగస్వామ్యం నమోదు కాగా.. అందులో గిల్ - సాయి సుదర్శన్‌ మధ్యే మూడుసార్లు ఉన్నాయి. ముంబయిపై రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇక ఆరుసార్లు శతక భాగస్వామ్యాల్లో గిల్ ఉండటం గమనార్హం. 
  • ప్లేఆఫ్స్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 10 సిక్స్‌లు కొట్టాడు. అంతకుముందు వృద్ధిమాన్‌ సాహా 2014 సీజన్‌ ఫైనల్‌లో కేకేఆర్‌పై 8 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు వీరిద్దరూ గుజరాత్ ఓపెనర్లు. 
  • భారత బ్యాటర్లలో వంద కంటే ఎక్కువ బౌండరీలు (ఫోర్లు, సిక్స్‌లు) బాదిన రెండో బ్యాటర్ గిల్. ఐపీఎల్‌లో గిల్ ఇప్పటి వరకు 111 బౌండరీలు కొట్టాడు. అతడికంటే ముందు విరాట్ కోహ్లీ (122) ఉన్నాడు. ఫైనల్‌లోనూ మరో 12 కొడితే విరాట్‌ను గిల్ అధిగమిస్తాడు. 
  • ప్లేఆఫ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ రికార్డు సృష్టించింది. ముంబయిపై 233/3 స్కోరు చేసింది. ఆ తర్వాత 2014 సీజన్‌లో సీఎస్‌కేపై పంజాబ్ 226/6, డెక్కన్‌ ఛార్జర్‌పై సీఎస్‌కే 222/5 స్కోరు చేసింది. 
  • ప్లేఆఫ్స్‌లో ఒకే మ్యాచ్‌లో ఎక్కువ పరుగుల నమోదైన మూడో మ్యాచ్‌ ఇది. ముంబయి - గుజరాత్‌ మ్యాచ్‌లో ఇరు జట్లూ కలిపి 404 పరుగులు చేశాయి. ఇంతకుముందు పంజాబ్ -  చెన్నై 2014 సీజన్‌ క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో 428 పరుగులు..  2016 ఐపీఎల్‌ ఫైనల్‌లో (SRH vs RCB) 408 పరుగులు నమోదయ్యాయి. 
  • ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ యాదవ్ ఛేదన సమయంలో 189.18 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 420 రన్స్‌ సాధించాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 83. అలాగే ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (181.13) కూడా సూర్యాదే. 
  • మోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. గుజరాత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు ఇవే.  డెత్‌ ఓవర్లలోనూ అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మారాడు. మోహిత్ 14 వికెట్లు తీయగా.. చెన్నై బౌలర్‌ పతిరణ 16 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌ కూడా గుజరాత్-చెన్నై ఉండటంతో వీరిద్దరిలో ఎవరు టాపర్‌గా మారుతారో వేచి చూడాలి. 
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక తేడా నమోదైన ఐదో మ్యాచ్‌ ఇది. ముంబయిపై గుజరాత్ 62 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో 2008 సెమీఫైనల్‌లో డెక్కన్‌ ఛార్జర్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 105 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని