Hardik: ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్‌

న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ (IND vs NZ)ను భారత్‌ సొంతం చేసుకొంది. శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించగా.. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాకాలను నమోదు చేశాడు. సిరీస్‌ ఆసాంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

Published : 02 Feb 2023 15:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తెలిపారు. కివీస్‌ టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్‌ మాట్లాడాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్‌ శతకం సాధించడంతో భారత్‌ తొలుత  నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ హార్దిక్‌తో (4/16) సహా టీమ్‌ఇండియా బౌలర్లు రాణించడంతో కివీస్‌ 66 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 168 పరుగుల భారీ తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. సిరీస్‌ ఆసాంతం బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన హార్దిక్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఇలా జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడేవాడని గుర్తు చేశాడు.

‘‘సిక్స్‌లను కొట్టడాన్ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తా. అయితే జీవితంలో పరిణితి చెందుతూ ఉండాలి. అందుకే బ్యాటింగ్‌ చేసేటప్పుడు నా తోటి ఆటగాడికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. పార్టనర్‌షిప్‌ చాలా కీలకమని భావిస్తా.  ఈ ఆటగాళ్ల కంటే కాస్త ఎక్కువ మ్యాచ్‌లను నేను ఆడా. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి.. ప్రశాంతంగా మ్యాచ్‌ను ఎలా ముగించడం అన్నదానిపై నిరంతరం నేర్చుకుంటూనే ఉంటా. ఒక్కోసారి నా స్ట్రైక్‌రేట్‌ కాస్త తక్కువగా ఉండొచ్చేమో.. కానీ జట్టు కోసం అవసరమైతే ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధంగా ఉంటా. అందుకే కొత్త బంతితో బౌలింగ్‌ చేయాలని అనుకుంటా. క్లిష్టతరమైన పాత్రను పోషించడానికి ఇతరులను ఇబ్బంది పెట్టను. ముందుండి జట్టును నడిపించాలని కోరుకుంటా. అంతేకాకుండా కొత్త బంతితో నా బౌలింగ్‌ నైపుణ్యాలను కూడా పరీక్షించేందుకు అవకాశం దొరుకుతుంది’’ అని తెలిపాడు.

ఇప్పుడు తాను ఆడుతున్న విధానం ఎంఎస్ ధోనీ తన కెరీర్‌ వివిధ దశల్లో పోషించిన పాత్రను పోలి ఉంటుందనే విశ్లేషణపై పాండ్య స్పందించాడు. ‘‘మహేంద్ర సింగ్ ధోనీ గతంలో పోషించిన పాత్రను తీసుకోవడానికి వెనుకాడను. మహీ కెప్టెన్సీ అందుకొన్న తొలినాళ్లలో నేను చాలా చిన్నవాడిని. అతడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ బాధ్యత అంతా నాపై పడింది. అయితే అదేమీ నాకు సమస్య కాదు. ఫలితాలు అద్భుతంగానే వస్తున్నాయి. కొన్నిసార్లు నిదానంగా ఆడాల్సి వస్తుంది. అయితే పరిస్థితికి అనుగుణంగా ఆడుతున్నా కాబట్టి.. అదేం ఫర్వాలేదు’’ అని పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు