Hardik Pandya: ఆత్మవిశ్వాసం.. ఒత్తిడిని తట్టుకోవడమే హార్దిక్‌ ఉన్నతికి కారణం!

గత కొంతకాలంగా టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్‌లో డేంజరస్‌గా మారాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడుతూ...

Published : 22 Sep 2022 21:25 IST

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మ్యాథ్యూ హేడెన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొంతకాలంగా టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్‌లో ప్రమాదకారిగా మారాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, బౌలింగ్‌లో కాస్త నిరాశపర్చినా.. బ్యాటింగ్‌ మాత్రం ధాటిగా చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య ప్రదర్శనపై ఆసీస్‌ మాజీ టాప్‌ ఓపెనర్‌ మ్యాథ్యూ హేడెన్ అభినందనలు కురింపించాడు. హార్దిక్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ను మెరుగుపర్చడంలో టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్ సంజయ్‌ బంగర్‌ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నాడు. 

గాయం కారణంగా సుదీర్ఘకాలంపాటు ఆటకు దూరమైన హార్దిక్‌ భారత టీ20 లీ‌గ్‌లో మాత్రం విజృంభించాడు. గుజరాత్‌కు లీగ్‌ టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ‘‘హార్దిక్‌కు తనపై నమ్మకం ఎక్కువ. అద్భుతమైన ప్రతిభ ఉంది. తనదైన రోజున మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ఇప్పటికే భారత టీ20 లీగ్‌లో దీనిని నిరూపించుకొన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. క్రికెటర్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. దీనికి కారణం.. హార్దిక్‌ ఆత్మవిశ్వాసం. అలాగే పరిస్థితిని చక్కగా అంచనా వేసి దానికి తగ్గట్టు ఆడతాడు. ఒత్తిడి సమయంలోనూ హ్యాండిల్‌ చేయగల సమర్థుడు’’ అని మ్యాథ్యూ హేడెన్‌  తెలిపాడు.

బెన్‌స్టోక్స్‌తో అప్పుడే పోల్చలేం..

హార్దిక్‌ పాండ్య అద్భుతమైన ఆటగాడైనప్పటికీ.. ఇప్పుడే ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌తో పోల్చడం సరైంది కాదని పాక్‌ మాజీ ఆటగాడు రషీద్‌ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్ స్థాయికి హార్దిక్‌ చేరుకొన్నాడా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘దానిని ఇప్పుడే అంగీకరించలేను. ఎందుకంటే బెన్‌స్టోక్స్‌కు మంచి రికార్డు ఉంది. మెగా టోర్నీల్లో అద్భుతంగా ఆడాడు. పాండ్యకు ఇలాంటిది ఇంకా లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రమే ప్రస్తుతం బాగా ఆడుతున్నాడు. అందుకే తొందరపడి వీరిని పోల్చడం సరికాదు’’ అని లతీఫ్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు